ఈడీ కేసులో ఇరుక్కున్న హీరోయిన్లు.. డింపుల్ హయాతి, ఈషా రెబ్బ సహా ఎవరెవరంటే!
హైదరాబాద్ లో గత కొద్ది రోజులుగా కలకలం రేపుతున్న ఈడి రైడ్స్ వ్యవహారంలో ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో ప్రవీణ్ చికోటి అనే వ్యక్తి కాసినో నిర్వాహకుడిగా ఉన్నారు. ఆయన నేపాల్ లో నిర్వహించిన ఒక భారీ క్యాసినో శిబిరానికి సంబంధించి పోలీసులు ఈడి రైడ్స్ జరపగా అందులో సినీ హీరోయిన్ల ప్రమేయం కూడా బయటపడింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఈడి రైడ్స్
హైదరాబాద్ కు చెందిన చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి అనేక మంది ప్రముఖులకు ఇతర దేశాలకు తీసుకువెళ్లి వారితో కాసినో వల్ల నిర్వహించి భారీ ఎత్తున డబ్బు సంపాదిస్తున్నాడని ఆరోపణలతో ఈడి రంగంలోకి దిగింది. ప్రవీణ్ సహా అతని అనుచరులు మాధవ రెడ్డి అనే వ్యక్తిపై సుమారు రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ పోలీసులు, ఈడి సంయుక్తంగా రైడ్స్ నిర్వహిస్తున్నారు.

కేసినో శిబిరానికి
ఈ నేపథ్యంలోనే ఆయన మే నెలలో నేపాల్ లో నిర్వహించిన ఒక కేసినో శిబిరానికి సంబంధించి కొంత మంది హీరోయిన్లు ప్రచారకర్తలుగా వ్యవహరించిన వ్యవహారం తాజాగా తెరమీదకు వచ్చింది. ఈ క్యాసినోకి సంబంధించి ఒకప్పటి బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ కు ప్రవీణ్ కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారని, అమీషా పటేల్ కు 50 లక్షలు, బాలీవుడ్ హీరో గోవిందకి 50 లక్షలు, టాలీవుడ్ భామ ఈషా 40 లక్షలు, రవితేజ హీరోయిన్ డింపుల్ హయాతికి 40 లక్షలు బాలీవుడ్ వివాదాస్పద కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు 20 లక్షలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఫేమస్ అయిన ముమైత్ ఖాన్ కు 15 లక్షలు ఇచ్చినట్లుగా ఈడీ అధికారులు ఆధారాలు గుర్తించారు.

సినీ అవకాశాల కోసం
సాధారణంగా సినీ నటులు వివిధ బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. అలాగే వివిధ ప్రొడక్ట్స్ కి కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక క్యాసినో శిబిరానికి వారు ప్రచారం నిర్వహించిన వ్యవహారం తెరమీదకు రావడంతో ఈ లిస్టులో పేర్లు ఉన్న వారంతా చిక్కుల్లో పడినట్లే అని భావిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యనే సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న డింపుల్ హయాతి, ఈషా రెబ్బ కూడా ఈ లిస్టులో ఉండడం కలకలం రేపుతోంది.

సీజ్ చేసి
ఇక ప్రవీణ్ కి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనితో అనేకమంది వీఐపీ లకి లింకులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి నేపాల్ వెళ్లిన కస్టమర్లలో సుమారు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈడీ ప్రవీణ్ ఫోన్, లాప్ టాప్ సీజ్ చేసి అనేక ఆధారాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది.

హీరోయిన్ల ప్రమేయం
కేవలం నేపాల్ మాత్రమే కాకుండా ఇండోనేషియా శ్రీలంక వంటి అనేక దేశాలకు ప్రవీణ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడని తెలుస్తోంది. ప్రైవేట్ హోటల్స్ బుక్ చేస్తూ ప్రైవేట్ జట్లలో కాసినోలకు కస్టమర్లను తరలించడం చూస్తుంటే అతని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారంలో టాలీవుడ్ హీరోయిన్ల ప్రమేయం ఉండడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.


Click it and Unblock the Notifications











