"తెరమీద అయినా బయట అయినా నేను నేనే. నన్ను ఏ నటితోనూ పోల్చకండి" అని కస్సు బుస్సులాడుతోంది నమిత. ఆ మధ్య తమిళ తెరపై అందాలు ఆరబోసిన నమిత ఈ మధ్య కూసింత సన్నబడింది. ఆంటే ఆమె యుఎస్ పి ని దెబ్బతీసేటంత సన్నగా కాదు. 'బిల్లా'లో కంటే సన్నగానే కనిపిస్తోంది. అలాగని మరీ బక్కగా అయిపోయిందని అనుకోవద్దు. ప్రస్తుతం 'దేశద్రోహి' చిత్రంలో పోలీసు అధికారిణిగా నటిస్తోంది. నమితను కదిలిస్తే ''నేను 'దేశద్రోహి' చిత్రంలో పోలీసు పాత్రలో చేస్తున్నాను. అప్పట్నించి చాలా మంది 'విజయశాంతిలా చేయగలననుకుంటున్నారా?' అని అడుగుతున్నారు. కానీ నేను ఆమెలా ఎందుకు చేయాలి? నేను నాలాగే చేస్తాను. నాకు నిజ జీవితంలో స్ఫూర్తి కిరణ్‌బేడి. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఈ పాత్రకు న్యాయం చేస్తాను. అంతేగానీ.. తెరవేల్పులను అనుసరించడం నాకు నచ్చదు. వేరొకరితో పోల్చవద్దు. ఆమెకంటే ఈమె బాగా చేసింది... ఈమె ఆమెలా చేయలేదు అంటూ లెక్కలేయొద్దు'' అని చెప్పింది.