నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..బాలయ్య కామెంట్స్ ట్రెండింగ్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. ఆయనను చూసే ఎంతో మంది స్టార్స్ తమ పెట్టుబడులను వ్యాపారాల్లో పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. నాగార్జునకున్న ఎన్నో వ్యాపారాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. టాలీవుడ్ ప్రముఖులకు, హైదరాబాద్‌లోని హై ప్రొఫైల్ వ్యక్తులకు ఎన్ కన్వెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఈవెంట్లు, బర్త్ డే పార్టీకు ఈ సెంటర్ వేదికగా నిలిచింది. అలాంటి ఈ ఫంక్షన్ హాల్‌ను ప్రభుత్వ అధికారులు కూల్చివేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
తమ్మిడికుంట ప్రాంతంలోని ఓ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నాగార్జున నిర్మించారని ఎప్పటి నుంచో అభియోగాలున్నాయి. కొందరు ఈ అంశంపై కోర్టును కూడా ఆశ్రయించగా, కొన్ని కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. నాగార్జున కన్వెన్షన్ సెంటర్‌పై కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విపరీతంగా ఫిర్యాదులు అందాయి. ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సహా ఇతర ప్రభుత్వ విభాగాలు ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయాలని నిర్ణయించాయి. అయితే బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ పెద్దల వద్ద పలుకుబడిని ఉపయోగించి నాగార్జున పలుమార్లు కూల్చివేతలను అడ్డుకున్నట్లుగా ఫిలింనగర్‌లో ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆక్రమణలను తొలగించి, కబ్జాదారుల భరతం పడతామని ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తామని ఆ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో బడా బాబులకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ విభాగం. ఎన్ కన్వెన్షన్‌ను ఆక్రమంగా నిర్మించారని.. దానిని కూల్చివేయాల్సిందిగా కొద్దిరోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఓ ఫిర్యాదు అందింది. దీనిని పరిశీలించిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు శనివారం ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసింది.
దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం స్టే విధించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే న్యాయస్థానం నుంచి ఎలాంటి స్టే లేదని హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 కుంటలు, బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 కుంటల్లో దీనిని నిర్మించారని రంగనాథ్ వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్‌కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవని, బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వలేదన్నారు.
ఇంత జరిగినా సినీ పరిశ్రమ నుంచి నాగార్జునకు మద్ధతుగా ఎవరూ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వంతో లేనిపోని తలనొప్పి మనకెందుకనే వాళ్లు వెనకడుగు వేసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో మరో అగ్రనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఓ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న బాలయ్య సీరియస్‌గా మాట్లాడారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై గతంలో ఎన్నో మీటింగ్స్ జరిగాయని.. వాటికి తనను ఎవ్వరూ పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారంతా హైదరాబాద్‌లో భూములు పంచుకుంటారా అంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరినుద్దేశించి ఈ కామెంట్స్ చేశారో తెలియదు కానీ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో ఈ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











