50 రోజులు కెమెరాకు దూరమయ్యా .. ‘సత్యభామ’ ఈవెంట్‌లో బాలకృష్ణ ఎమోషనల్
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'సత్యభామ' సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. జూన్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా శుక్రవారం సత్యభామ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు నటసింహం నందమూరి బాలకృష్ణ , దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ఇలాంటి పాత్రల్లోనే నటించాలని కాజల్ గీత గీసుకోలేదన్నారు. బిడ్డకు జన్మనిచ్చినా మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటిందని.. తాను నటించిన భగవంత్ కేసరిలో నటించినందుకు కాజల్‌కు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు పూర్తవగానే ఫుల్‌జోష్‌తో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నానని బాలయ్య తెలిపారు. ఎన్నికల వల్ల దాదాపు 50 రోజులు కెమెరాకు దూరమయ్యానని.. ఆ లోటును ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం భర్తీ చేసిందన్నారు. సత్యభామలో కాజల్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా చేసిందని బాలయ్య ప్రశంసించారు.

నేడు నారద జయంతి అని చెప్పిన బాలకృష్ణ.. ఆయన గురించి ఎవ్వరూ మాట్లాడుకోరని, కెరీర్‌లో ఎన్నో క్యారెక్టర్లు పోషించిన నాన్నగారు నారదుడిగా నటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తనకు ఆ అదృష్టం దక్కిందని.. శ్రీనివాస కళ్యాణంలో తాను నారదుడిగా నటించానని బాలయ్య గుర్తుచేశారు. కాజల్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షించారు. గూఢచారి, మేజర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన శశికిరణ్ తిక్కా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించారని .. నవీన్ చంద్ర చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు.
కాజల్ మాట్లాడుతూ.. బాలయ్య అన్‌స్టాపబుల్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆయనకు క్యాలిక్యులేషన్స్ ఉండవని.. కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయని చెప్పింది. సత్యభామ కథను శశికిరణ్ తన టీమ్‌తో వచ్చి చెప్పారని , తనకు లైన్ బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పానని కాజల్ తెలిపారు. సత్యభామగా మేకోవర్ కావడానికి శశికిరణే కారణమని ప్రశంసించింది. అమర్‌గా నవీన్ చంద్ర కంటే మరొకరు బాగా చేయలేరేమో .. మరోసారి ఆయనతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఇన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులు తనకు అండగా నిలిచారని అందుకు కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇక సత్యభామలో కాజల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఓ హత్య కేసు విషయంలో చేసిన పొరపాటున ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది.. అయినప్పటికీ అసలు దోషిని కాజల్ ఎలా కనిపెట్టింది అనేది ఈ సినిమా. యాక్షన్ సీన్ల కోసం కాజల్ పడిన కష్టం వెండితెరపై స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ నెల 31న విడుదల కావాల్సిన సత్యభామను జూన్ 7కి వాయిదా వేశారు. ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు. 'అవురమ్ ఆర్ట్స్ పతాకం'పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కెలపల్లిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











