మా ఆయనకు బంపర్ మెజారిటీ ఖాయం, మేము అడగక్కర్లేదు.. బాలయ్య సతీమణి వసుంధర!
నందమూరి బాలకృష్ణ వరుసగా రెండవసారి హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి బాలయ్య బరిలో దిగుతున్నారు. ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రచారం జోరందుకుంది. బాలయ్య సతీమణి వసుంధర హిందూపురంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం.

ఇంటింటికి తిరుగుతూ
బాలయ్య సతీమణి వసుంధర హిందూపురం నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతూ బాలకృష్ణగారిని గెలిపించాలని కోరుతున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఆమె వెంట నడుస్తున్నారు. బట్టలు ఐరన్ చేసే ఓ దుకాణంలో కాసేపు ఆమె కూడా ఇస్త్రీ చేశారు. దీనితో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

హామీలన్నీ నెరవేర్చారు
మీడియాతో మాట్లాడుతూ ప్రచారానికి వస్తున్న స్పందని తెలియజేశారు. ఇక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నట్లు వసుంధర చెప్పుకొచ్చారు. 2014లో ఎనలేని అభిమానం చూపించారు. అప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. ఇప్పుడు అంతకు మించిన అభిమానం చూపిస్తున్నారు అని వసుంధర తెలిపారు. ఇక్కడ ప్రజలు నీటిసమస్య తీర్చమని ప్రధానంగా డిమాండ్ చేశారు. వారి నీటి సమస్య తీర్చే ఓట్లు అడుగుతున్నాం అని వసుంధర తెలిపారు.

కష్టపడాల్సిన అవసరం లేదు
ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే.. మీరు ఇంతలా కష్టపడి ప్రచారం చేయవలసిన అవసరం లేదు.తాము అడగకుండానే ప్రభుత్వ పథకాలు అన్ని అందుతున్నాయని ప్రజలు చెబుతున్నట్లు వసుంధర అన్నారు. మా మద్దతు టిడిపికే అని ప్రజలే అంటున్నారు అని వసుంధర తెలిపారు. కానీ ప్రజల్లో ఉందామని, వారి అవసరాలు తెలుసుకుందామని ప్రచారం చేస్తున్నట్లు ఆమె వివరించారు.

బంపర్ మెజారిటీ
ఇక్కడ బాలకృష్ణగారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రశ్నించగా.. గతంలో కంటే భారీ మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే ఎంత మెజారిటీ వస్తుందో ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నట్లు వసుంధర అన్నారు. ప్రతి మహిళకు బొట్టు పెడుతూ ఆమె ప్రచారాన్ని కొనసాగించారు.


Click it and Unblock the Notifications











