నందమూరి ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఆదిత్య 369 మూవీతో వారం ముందుగానే బాలయ్య!
తెలుగు సినిమా రంగంలోనే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం స్టార్ హీరోలు నటించిన గత చిత్రాల రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్నది. క్లాసిక్, కల్ట్ హిట్స్‌లకు నేటి తరం చూపుతున్న ఆదరణ చూస్తే కొత్త సినిమాలు అలాంటి ప్రోత్సాహాన్ని పొందలేకపోతున్నాయనే వాదన మొదలైంది. మహేష్, ప్రభాస్, రాంచరణ్, పవన్ కల్యాణ్ నటించిన పలు చిత్రాలు రిలీజై భారీగా కలెక్షన్లు సాధించాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ ఆదిత్య 369 చిత్రం రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్‌కు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ శుభవార్తను అందించారు. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ఆదిత్య 369. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా అద్బుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆల్ టైమ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది. ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

ఆదిత్య 369 లాంటి అద్బుతమైన చిత్రాన్ని ఈ తరం వారికి చూపించి కొత్త అనుభూతిని పంచే లక్ష్యంతో ఈ మూవీని లెటేస్ట్ టెక్నాలజీతో హంగులు అద్దారు. ఈ సినిమాను 4K టెక్నాలజీతోపాటు 5.1 సౌండ్‌లోకి కన్వర్ట్ చేశారు. ఈ ప్రింట్ వెర్షన్‌ను డిజిటల్‌కు మార్చడంలో ప్రసాద్ డిజిటల్ టీమ్ 6 నెలలు శ్రమించింది. 34 ఏళ్ల క్రితం నాటి సినిమాను చక్కటి అవుట్‌పుట్‌ను అందించారు. గత తరాన్ని ఊర్రూతలూగించిన ఈ సినిమా ఈతరమే కాకుండా వచ్చే తరాలకు కూడా కొత్త అనుభూతిని పంచే విధంగా టెక్నాలజీ హంగులు అద్దారు.
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో రూపొందిన ఈ చిత్రం జూలై 18, 1991న విడుదలై అఖండ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రాన్ని తొలుత ఏప్రీల్ 11వ తేదీన రిలీజ్ చేయాలని డేట్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను అభిమానుల చెంతకు ముందుగానే అందించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 4వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించి.. నందమూరి ఫ్యాన్స్‌కు శుభవార్తను అందించింది.
ఆదిత్య 369 రీ రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. నందమూరి బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్‌కి సిద్ధమైంది. చక్కని థియేటర్లు లభించడంతో, ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం. నందమూరి అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ఇదొక గొప్ప కానుక అని అన్నారు.
ఆదిత్య 369 సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ బాలీవుడ్ టాప్ విలన్ అమ్రిష్ పురి, ఫేమస్ నటుడు టినూ ఆనంద్, మోహిని, శుభలేఖ సుధాకర్, హీరో తరుణ్, సిల్క్ స్మిత, చలపతిరావు, గోల్లపూడి మారుతీరావు తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతం, జంధ్యాల మాటలు, ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పీసీ శ్రీరామ్ - వీఎస్ఆర్ స్వామి - కబీర్ లాల్ ఛాయాగ్రహణం ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.


Click it and Unblock the Notifications











