నారా రోహిత్ కొత్త చిత్రం ప్రారంభమైంది
'బాణం'తో పరిచయమైన నారా రోహీత్ కొత్త చిత్రం హైదరాబాద్‌లో గురువారం అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ప్రముఖ రచయిత, దర్శకుడు నిర్మాత సి.వి.రెడ్డి అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ రాగ దర్శకుడు. నిత్యామీనన్ హీరోయిన్. ఈ సందర్బంగా నిర్మాత సీవీ రెడ్డి మాట్లాడుతూ -''ఇది ప్రేమ, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇంతకు ముందు రోహిత్ చేసిన రెండు సినిమాలలోని పాత్రలకు భిన్నంగా ఇందులోని పాత్ర ఉంటుంది. అలాగే నిత్యామీనన్ కూడా నటనకు అవకాశం ఉన్న మంచి పాత్ర చేస్తున్నారు. ఆసక్తిరమైన కథ, కథనాలతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా దర్శకుడు కథ తయారు చేశాడు.
ఈ నెల 5నుంచి 9 వరకు హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. తర్వాత ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అరకులో షెడ్యూల్ చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. మే చివరి వారంలో గానీ, జూన్ తొలివారంలో గానీ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.. కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, చంద్రమోహన్, నాగబాబు, సుధ, జి.వి., స్నిగ్ధ తదితరులు నటించే ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ఆండ్రూ, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: నాగేంద్ర, ఫైట్స్: గణేష్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.


Click it and Unblock the Notifications











