కొత్త కోణంలో ఒక్కడినే... నారా రోహిత్
'సోలో' సినిమా ద్వారా మంచి విజయం సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్ 'ఒక్కడినే'అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జెనిలియాతో కథ చిత్రం చేసిన శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అరవై శాతం టాకీ పూర్తైంది. ఈ చిత్రం లవ్, యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతోందని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని సి.వి.రెడ్డి గులాబి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిత్యామీనన్ ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన చేస్తోంది. ఈ చిత్రం విశేషాలను తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "మా దర్శకుడు శ్రీనివాస్ రాగ 'ఒక్కడినే' చిత్రాన్ని ఇంటిల్లపాది మెచ్చి ఆనందించే చిత్రంగా తీర్చిదిద్దుతున్నారు. కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఓ కొత్త కోణంలో తెరకెక్కిస్తున్నారు. లవ్, యాక్షన్‌ల నేపథ్యంలోనూ సాగుతుంది. ఇప్పటిదాకా జరిగిన రెండు షెడ్యూళ్లలో 60 శాతం టాకీతో పాటు రెండు పాటల్ని, రెండు ఫైట్స్‌ని చిత్రీకరించాం. ఆదివారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్ జరుగుతుంది. దీంతో మొత్తం టాకీ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలను కూడా త్వరగా తెరకెక్కిస్తాం. ఇందులో ఓ కీలక పాత్రను సాయికుమార్ పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఈ షెడ్యూల్లోనే ఉంటుంది'' అని అన్నారు.
ఈ సినిమాపై అంచనాలు అదికంగా బాగా ఉన్నాయి. దీనికి కారణం నారా రోహిత్ చేసిన 'సోలో', నిత్యామీనన్ తాజాగా నటించిన 'ఇష్క్' చిత్రాలు. ఈ రెండూ విజయవంతం కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్‌కు తగ్గ కథ ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది. ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు. ఆడియో సైతం త్వరలో విడుదల చేసి పబ్లిసిటీ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంతో తాను కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు నారా రోహిత్ ప్రయత్నిస్తున్నారు. నిత్యా మీనన్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో నాగబాబు, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, జీవీ, అలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కెమెరా: ఆండ్రూ బాబు, కళ: నాగేంద్ర, ఫైట్స్: గణేష్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస రాగ


Click it and Unblock the Notifications











