సర్కారు వారి పాట సీక్వెల్ చేస్తానన్న వైసీపీ ఎంపీ.. మహేష్ లేకుంటే తానే హీరోగా?
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాకు ఒక సీక్వెల్ చేస్తానంటూ వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సీక్వెల్లో మహేష్ హీరోగా ఉండక పోతే తాను హీరోగా ఉంటానని ఆయన కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సర్కారు వారి పాట
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సర్కారు వారి పాట.. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్స్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్రకని, నదియ, నాగబాబు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

ఉద్దేశ పూర్వకంగానే
సినిమా విడుదలైన నాటి నుంచి సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రధారి గా నటించిన సముద్రకని పేరు రాజేంద్రనాథ్.. ఆయన విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక రాజ్యసభ ఎంపి అన్నట్లు సినిమాలో చూపించారు. ఒక పది వేల కోట్ల రూపాయల బ్యాంకు నుంచి రుణం తీసుకుని, కావాలనే దానిని ఎగవేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సినిమాలో చూపించారు.

సర్కారు వారి ఆట
అయితే నిజజీవితంలో అది వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలి ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. ఇదే విషయం మీద ఆయనను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే ఆయన ఆసక్తికరంగా స్పందించారు. సర్కారి వారి పాట సినిమాకు సీక్వెల్ గా సర్కారి వారి ఆట చిత్రాన్ని రూపొందించాలని డైరెక్టర్ పరశురామ్ కు చెబుతానని... ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు నటిస్తారని, లేదంటే తానే హీరోగా నటిస్తానని నరసాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు తెలిపారు.

రాజేంద్రనాథ్ పాత్ర పోలి ఉందంటూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేని ఆదాయాన్ని చూపి బ్యాంకు రుణాలను ఎలా పొందుతూ, బ్యాంకులను మోసగిస్తుందో ... వాస్తవ సంఘటనల ఆధారంగానే సర్కారి వారి ఆట చిత్రాన్ని రూపొందించాలని తాను పరుశురామ్, చిత్ర నిర్మాతలను కోరుతానని చెప్పారు. ఏపీలో కార్పొరేషన్ల పేరిట రుణాలను పొందుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకులను మోసగిస్తోందని ఆయన అన్నారు.. సర్కారు వారి పాట సినిమాలో విలన్ రాజేంద్రనాథ్ పాత్ర తనని పోలి ఉందని ఒక అనుభవం లేని ఒక యాంకర్ ప్రశ్నించిందని... అయితే విలన్ పాత్ర తనది కాదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని చెప్పానని ఆయన పేర్కొన్నారు.

విషప్రచారం
ఇక బ్యాంకుల్ని తానేమీ మోసగించ లేదని, తనకు రాష్ట్ర ప్రభుత్వం అంతకు రెండింతల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ తరహా విషప్రచారం సరికాదని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. మరి ఈ సీక్వెల్ వ్యవహారం నిజంగా జరుగుతుందా లేక రాజకీయ విమర్శలు వరకే పరిమితం అవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది కాగా రఘురామకృష్ణంరాజు కు సినీ ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పుకుంటూ ఉంటారు.


Click it and Unblock the Notifications











