ఆర్ నారాయణమూర్తి 'వీర తెలంగాణ' రిలీజ్ డేట్..
నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి రూపొందించిన 'వీర తెలంగాణ' ఈ నెల 9న విడుదలవుతోంది. స్నేహచిత్ర పతాకంపై ఆయన నిర్మించిన 22 వ చిత్రం ఇది. ఇక ఈ చిత్రం గురించి చెబుతూ...చిత్రం సెన్సార్ పూర్తయిందని, ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. అలాగే పాటలను ఆదరిస్తున్న శ్రోతలకు, రచించిన ప్రజాకవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక కథ గురించి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడు వేల గ్రామాల ప్రజలు పాల్గొన్నారని, ఎంతో మంది అసువులు బాశారని వారి స్పూర్తితో ఈ కథ తయారు చేసుకున్నామని నారాయణమూర్తి చెప్పారు. చారిత్రిక పాత్రలను తీసుకుని ముఖ్యమైన సంఘటనల్ని కథారూపంగా అల్లి, చారిత్రక విషయాల్ని వక్రీకరించకుండా తెలంగాణ పోరాట గొప్పతనాన్ని, ఆ మట్టి మనుషుల త్యాగాల్నీ 'వీర తెలంగాణ'లో చాటిచెప్పినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చి దేశ చరిత్రకు న్యాయం చేకూర్చాలని నారాయణమూర్తి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











