మోడీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు: సల్మాన్
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన అంశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల పొంగల్ సందర్భంగా జరిగిన కైట్ ఫెస్టివల్‌లో మోడీతో కలిసి పాల్గొన్న సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ....'గోద్రా అల్లర్ల కేసులో మెడీ ప్రమేయం ఉన్నట్లు తేలలేదు. అందు వల్ల మత ఘర్షణలకు సంబంధించిన ఈ అంశంలో మోడీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీని ప్రధాని కావాలని కోరుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ....నా అభిప్రాయాలను కోట్లాది అభిమానులపై రుద్దడం నాకు ఇష్టం లేదు అని సల్మాన్ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రితో కలిసి కైట్స్ ఎగురవేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సల్మాన్ ఖాన్ తెలిపారు.

''జైహో' సినిమా ప్రచారం నిమిత్తం గత మంగళవారం అహ్మదాబాద్‌కు వెళ్లిన సల్మాన్‌ఖాన్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో కలిసి సంక్రాంతి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ గుజరాత్‌ను ఎంతగానో అభివృద్ధి చేశారని, కచ్చితంగా ఆయన తన లక్ష్యాన్ని చేరుకుంటారని వ్యాఖ్యానించారు.
సల్మాన్ వాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇండియా దేశీయ లీగ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షమా అధ్యక్షతన చేపాక్ వద్ద ఆందోళనకు దిగింది. సల్మాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి ఆపై విడుదల చేశారు. దీనిపై సల్మాన్ ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు.
సల్మాన్ ఖాన్ 'జైహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 24, 2014లో ఈచిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీమియర్ షోకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సల్మాన్. జనవరి 23 ముంబైలో ఈ చిత్రం ప్రీమియర్ షో జరుగనుంది.


Click it and Unblock the Notifications











