RRR కలెక్షన్లు కంటే .. RR ట్యాక్స్ వసూళ్లే ఎక్కువ : రేవంత్ రెడ్డిపై మోడీ పంచ్‌లు ..!
భారతదేశంలో సినిమాకు రాజకీయానికి దశాబ్ధాలుగా అవినాభావ సంబంధం వుంది. ఈ రెండు రంగాలు దేనికదే ప్రత్యేకమైనదే అయినప్పటికీ .. ప్రజల జీవితాలపై వేసిన ముద్ర మాత్రం అసాధారణం. నాయకులను, సినీనటులను జనం ఇలవేల్పుల్లా కొలవడం ఒక్క మనదేశానికే చెందుతుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎంతోమంది తారలు రాజకీయాల్లోకి రావడమో లేదంటే ఆయా పార్టీల తరపున ప్రచారం చేయడమో చూస్తూనే వున్నాం. పార్టీలు కూడా సినిమాలను, పాటలను, డైలాగులను తమ రాజకీయం కోసం వాడుకోవడం కూడా బాగా ఎక్కువైంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీయే అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఏడు పదుల వయసులో మండుటెండలను లెక్క చేయకుండా రోడ్ షోలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు ప్రధాని. పదేళ్లలో తామేం చేశామో, మరోసారి గెలిస్తే ఏం చేస్తామో వివరిస్తూ ప్రజలను ఆలోచింపచేస్తున్నారు. ఇక బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ను తన వాడివేడి విమర్శలు, సెటైర్లలో చెడుగుడు ఆడుకుంటున్నారు మోడీ.

బుధవారం తెలంగాణలోని వేములవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఫ్యామిలీయే ఫస్ట్ అని సెటైర్లు వేశారు. మూడో దశ ఎన్నికల పోలింగ్ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్ ఎగిరిపోయిందని .. కాంగ్రెస్-బీఆర్ఎస్‌లను అవినీతి కలుపుతుందని మోడీ చురకలంటించారు. ఓటుకు నోటు కేసును బీఆర్ఎస్ విచారించలేదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్ మాట్లాడటం లేదని ప్రధాని దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీని మోడీ ప్రస్తావించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.1000 కోట్లు కలెక్షన్లు వస్తే.. 3 నెలల్లోనే ఆర్ఆర్ (రేవంత్ రెడ్డి) ట్యాక్స్ దానిని మించిపోయిందని సీఎంపై ఆరోపణలు గుప్పించారు. ఇక్కడి వసూళ్లను ఢిల్లీకి పంపుతున్నారని..కాంగ్రెస్-బీఆర్ఎస్‌లు హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాచాయని మోడీ ఆరోపించారు.

భారతదేశంలో ఎంతో సమర్ధత వున్నా.. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ ఆ సామర్ధ్యాన్ని నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. పదేళ్లుగా నా పనితీరు ఎలా వుందో మీరంతా గమనించారని.. ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని ప్రధాని గుర్తుచేశారు. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని , అయోధ్య రామమందిరానికి తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయన్నారు.

మోడీ నోట ఆర్ఆర్ఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో మరోసారి ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు, ఎన్టీఆర్-రాంచరణ్ నటన, డ్యాన్సులు , యాక్షన్ సీక్వెన్సులు తోడై సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ.1,387.26 కోట్ల వసూళ్లను సాధించి తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పింది. ఈ చిత్రంలోని ''నాటు నాటు '' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ''ఆస్కార్'' అవార్డ్ దక్కింది. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ పాటగా చరిత్ర సృష్టించింది. అలాగే ఆర్ఆర్ఆర్‌లో నటనకు గాను ఎన్టీఆర్, రాంచరణ్‌లకు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది.


Click it and Unblock the Notifications











