నట్టి కుమార్ టార్గెట్ చిరంజీవి బావమరిది అల్లు అరవింద్
దాసరి నారాయణరావుకు ఉత్తమ నటుడి నంది అవార్డుపై రావడంపై మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. రామ్ చరణ్ తేజాకు కాకుండా దాసరి నారాయణ రావుకు ఉత్తమ నటుడు అవార్డు రావడంపై ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు నానా యాగీ చేశారు. దాంతో నట్టి కుమార్ దాసరికి అండగా నిలిచారు. దాంతో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి నట్టికుమార్ పై కొరడా ఝళిపించేందుకు సిద్ధపడ్డారు. దానిపై నట్టి కుమార్ టీవీ చానెళ్లకు ఎక్కారు. శ్యాంప్రసాద్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పనిలో పనిగా చిరంజీవి బావ మరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పై విరుచుకుపడ్డారు. సోమవారం ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నట్టి కుమార్ అల్లు అరవింద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్ని నిర్మాతల పాలిటి శాపంగా మారారని విరుచుకుపడ్డారు. నిర్మాతల మండలి నుంచి ఎవరినైనా తొలగించాల్సి వస్తే, అది అల్లు అరవింద్, శ్యాంప్రసాద్ రెడ్డినే అని ఆయన అన్నారు. అల్లు అరవింద్ కు శ్యాంప్రసాద్ రెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది నట్టి కుమార్ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. నిర్మాతల మండలి బడా నిర్మాతల కోసమే పనిచేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మేస్త్రీ సినిమాలో నటనకు గాను దాసరికి ఆ అవార్డు వచ్చింది. ఆ సినిమాను దాసరి నారాయణరావు ఎన్నికల సమయంలో తీశారు. ఆ సినిమాలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల గోదాలోకి దిగిన చిరంజీవిపై అనేక వ్యంగ్యాస్త్రాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మండిపాటుకు అది పరోక్ష కారణంగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











