నదిలో చిక్కుకున్న హీరో నవదీప్ ..సేఫ్
నవదీప్ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి నాగార్జునసాగర్ కృష్ణా రిజర్వాయర్‌లో ప్రైవేటుగా షికారుకు వెళ్లి శనివారం జలాశయం మధ్యలో చిక్కుకుపోయారు. వారు హైదరాబాద్ నుంచి తెప్పించుకున్న ప్రైవేటు బోటులో ఇంధనం అయిపోవటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఆచూకీ దొరకలేదని, గాలిస్తున్నారంటూ రకరకాల వదంతులు షికారు చేయడంతో నాలుగు గంటలపాటు సాగర్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వేరే బోటులో ఇంధనం పంపించి వారిని క్షేమంగా ఒడ్డుకు రప్పించారు. చివరకు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తిరిగి తిరిగి అనుపు వద్దకు చేరుకోవడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు.
అంతా అయ్యాక నవదీప్‌ను మాచర్ల సీఐ విజయవిహార్ అతిథి గృహంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. వినోదం కోసం సాగర్‌కు వచ్చామని, స్పీడ్ బోట్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని నవదీప్ చెప్పారు. దీనిని మీడియా పెద్ద రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. ఈ సంఘటనలో నవదీప్ తో పాటు అతని స్నేహితులు అరుణ్, శోలన్, స్వాతి, ప్రియాంక, శ్వేతారెడ్డి కూడా ఉన్నారు. ఇక ఈ ఘటనలో పోలీసులు మొత్తం ఆరుగురు అని చెప్తున్నా.. వీరిలో ఓ మీడియా అధిపతి కుమారుడు కూడా ఉన్నాడని సమాచారం. మీడియా అధిపతి కుమారుడిని, ఇద్దరు మహిళలను పోలీసులు మీడియాకు చూపించకుండానే తప్పించగలిగారు.


Click it and Unblock the Notifications











