ఫ్యాన్స్‌ను వ్యాపారం కోసం వాడుకుంటున్నారు : నాగబాబు
బెంగుళూరు : సినిమాల వ్యాపారం కోసం అభిమానులను వాడుకుంటున్నారని మెగా బ్రదర్ నాగబాబు నిప్పులు చెరిగారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం అర్థశత దినోత్సవ వేడుకలను ఇటీవల బెంగుళూరులోని అభిమానులు ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకకు హాజరుకాని నాయక్ మూవీ నిర్మాత డివివి దానయ్య, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ జ్ఞానేశ్వర్ లపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అభిమానులను కేవలం బిజినెస్ కోసమే వాడుకుంటున్నారని మండి పడ్డారు. హీరోలు, నిర్మాతలు ఈ స్థాయికి ఎదిగారంటే అభిమానుల ఆశీర్వాదమే అని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.
నేను ఈ సినిమాకు నిర్మాతను కాదు, నటించనూ లేదు, కానీ కేవలం మెగా అభిమానుల సంతోషం కోసమే తాను ఇక్కడికి వచ్చానన్నారు. సినిమా ప్రారంభ సమయంలో, ఆడియో వేడుక సమయంలో మీకు అభిమానులు కావాలి....ఎందుకంటే మీ వ్యాపారం బాగా సాగాలి. కానీ అభిమానులు ఆడియో వేడుక నిర్వహిస్తే మాత్రం మీరు రారు. అభిమానుల కష్టం గుర్తించని మీలాంటి నిర్మాతలు మెగా అభిమానులకు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మీడియా, అభిమానులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ....తన కుమారుడు వరుణ్ తేజ్ మొదటి చిత్రం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాతగా తెరకెక్కబోతోందని. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని నాగబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











