50 రోజుల ‘నాయక్’, ఎన్ని సెంటర్లంటే..?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం నేటితో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈచిత్రం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 51 సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితం అయినట్లు తెలుస్తోంది. ఈ విజయం మెగా అభిమానుల్లో మంచి జోష్‌ను నింపింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసారు. వినాయక్ తరచూ తీసే రొటీన్ సినిమాలా ఉందనే విమర్శలు వచ్చినప్పటికీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, జిలేబీ పాత్రలో బ్రహ్మీ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఇదంతా దర్శకుడు వినాయక్ సృష్టే అనుకోండి.
ఇక ఈ సినిమాకు కాజల్, అమలా పాల్ గ్లామర్ సొగసులతో పాటు, తమన్ సంగీతం, చోటా కె నాయుడు కెమెరా పనితనం బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఐస్ లాండ్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్లలో 'శుభలేఖ రాసుకున్న' సాంగు చిత్రీకరణ అందరినీ ఆకట్టుకుంది. అదే విధంగా సెంట్రల్ యూరఫ్ లోని స్లోవేనియా దేశంలోని అబ్బుర పరిచే పోస్టోజ్నా భూగర్బ గుహల్లో పాటల చిత్రీకరణ జరిపారు. ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్న 'నాయక్' తొలి భారతీయ సినిమా రికార్డు దక్కించుకుంది.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. సంక్రాంతిని పురస్కరించుకని జనవరి 9న ఈచిత్రం విడుదలైంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











