‘నాయక్’ హైలెట్స్ ఇవే: వినాయక్ (1210 థియేటర్స్)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'నాయక్' చిత్రం ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర దర్శక నిర్మాతలు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్రానికి సంబంధించిన విశేషాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వివి వినాయక్, నిర్మాత డివివి దానయ్య, కథా రచయిత ఆకుల శివ, పాటల రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ...'సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. తమన్ అందించిన సంగీతం మా సినిమాకు తొలి సక్సెస్. ఇప్పటికే సినిమాను చూసిన ప్రముఖులు అద్భుతంగా వచ్చిందని మెచ్చుకున్నారు. సినిమాల్లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డిల కామెడీ బాగా నవ్విస్తుంది. ఆకుల శివ కథ, మాటలు సినిమాకు మరో హైలెట్. నాయక్ సినిమా చరణ్ తో చేస్తున్నంత చేసే చిరంజీవితో చేసినట్లే అనిపించింది. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
ఈచిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ...'సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. మొత్తం 1210 థియేటర్లు ఇప్పటి వరకు కేటాయించ బడ్డాయి. చరణ్ కెరీర్లో ఈ సినిమా పెద్ద హిట్ సినిమా నిలుస్తుందనే నమ్మకం ఉంది. నాకు ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా తీయాలని ఉండేది. చరణ్ తో సినిమా తీయడం అంటే ఆయనతో తీసినట్లే ఉంది' అని చెప్పుకొచ్చారు.
నాయక్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్, అమలపాల్ హీరోయిన్లుగా చేయగా, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, రాహుల్ దేవ్, రఘుబాబు, సుధ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: చోటా కె. నాయుడు, కథ, మాటలు: ఆకుల శివ, నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











