నయనతార సొంత వాయిస్ ఆ తెలుగు సినిమాలో ...
హైదరాబాద్ : నయనతార గొంతు త్వరలో తెలుగు తెరపై వినపడనుంది. నయనతార,రానా కాంబినేషన్ లో రూపొందుతున్న 'కృష్ణంవందే జగద్గురుమ్' సినిమా కోసం నయనతార తన గొంతును సవరించింది. ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే ప్రథమం. ఇందులో నయన పాత్ర పేరు దేవిక. డాషింగ్ జర్నలిస్ట్. ఈ పాత్రకు నయనతారే డబ్బింగ్ చెబితే బావుంటుందని ఆ చిత్ర దర్శకుడు క్రిష్ భావించడంతో... నయన ఉత్సాహంతో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టేశారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ చిత్రం డబ్బింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజుల పాటు నయనతార డబ్బింగ్ చెప్పారు కూడా. దేవిక పాత్రకు నయనతార వాయిస్ మరింత శోభను తెచ్చిపెట్టిందని, ఆమె తెలుగు వినసొంపుగా ఉందని, ఏ మాత్రం బబ్లీనెస్ లేకుండా, జర్నలిస్ట్‌లో ఉండే పరిపక్వత, గంభీరత ఆమె వాయిస్‌లో ప్రతిధ్వనిస్తోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.
ఓ భిన్నమైన నేపథ్యంలో ఊహలకు అందని విధంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం హీరో రానా కెరీర్‌కి మేలి మలుపుగా నిలవడం ఖాయమని కూడా వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 'కృష్ణం వందే...' షూటింగ్ తుది దశకు చేరుకుంది. వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సన్నాహాలు చేస్తున్నారు.
ఇంతకుముందు మిస్టర్‌పర్‌ఫెక్ట్, మొగుడు చిత్రాల్లో తాప్సీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న విషయం తెలిసిందే. ఆ వరుసలో ఇప్పుడు నయనతార కూడా చెప్పుకోవటం మొదలెట్టడంతో ఇంకా మరింతమంది హీరోయిన్స్ కూడా ఇలా తమ గొంతులను విప్పే అవకాసముంది.


Click it and Unblock the Notifications











