కొత్త పాయింట్ తో... (‘మాయ’ప్రివ్యూ)
హైదరాబాద్ : మొదటి నుంచీ...విభిన్న కథాంశాలను ఎన్నుకొని ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు తీసే దర్శకునిగా నీలకంఠకు పేరుంది. తను తీసే చిత్రాలకు ఒకదానితో మరొకటి పోలిక లేకుండా ఆయన జాగ్రత్త పడి తీస్తూంటారు. అదే కోవలో ఈ సారి కూడా తెలుగు తెరకు కొత్త స్టోరీ లైన్ తో వచ్చారు. జరగబోయేది ముందే తెలిస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రమిది.
ఓ టీవి ఛానెల్ లో పనిచేసే మేఘన(అవంతిక) కు చిన్నప్పటి నుంచి భవిష్యత్తు కళ్ళముందు కనిపిస్తూంటుంది. అయితే ఆమె ఆ భవిష్యత్ ను మార్చలేదు. ఏమీ చేయలేదు. ఇలాంటి ఆమెకు ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్ధ వర్మ(హర్ష వర్దన్ రానే) పరిచయమవుతాడు. అతనితో ఆమె ప్రేమలో పడుతుంది. అయితే అతని గురించి ఓ చేదు నిజం ఆమె భవిష్యత్ దర్శనం చేస్తుంది. ఆ నిజం ఆమె భవిష్యత్ నే అతలా కుతలం చేసేలా ఉంటుంది. అటువంటి పరిస్ధితుల్లో మేఘన ఏం నిర్ణయం తీసుకుంది అనే అంశం చుట్టూ అల్లిన కథ ఇది.

దర్శకుడు మాట్లాడుతూ ''మనుషుల్లో ఉండే అతీంద్రీయ దృష్టి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు తలెత్తే సంఘర్షణ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. కథతో పాటు కథనంలోని కొత్తదనం ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తుంది'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.... మనుషుల్లో వుండే అతీంద్రియ దృష్టి (ఇఎస్‌పి- ఎక్స్‌ట్రా సెన్సరీ పెర్‌సెప్షన్) నేపథ్యంలో వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో సాగే థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందిందని, కొత్త కథాంశాలతో వచ్చే చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, సినిమా కథ, కథనం కొత్తగా ఉండే ఈ మాయ అందరికీ నచ్చుతుందని తెలిపారు.
బ్యానర్ : షిరిడి సాయి కంబైన్స్
నటీనటులు: హర్షవర్థన్‌రాణే, అవంతిక, సుష్మారాజ్, నందిని రాయ్, నాగబాబు,నాగబాబు, ఝాన్సీ, అనితాచౌదరి, వేణు తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర,
ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి,
కూర్పు: నవీన్,
కళ: గొట్టపల్లి బాబ్జి.
నిర్మాతలు:ఎం.వి.రెడ్డి, మధుర శ్రీధర్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:నీలకంఠ.
విడుదల తేది: 01,ఆగస్టు, 2014.


Click it and Unblock the Notifications











