The Kerala Story.. ఇస్లాంలోకి 32000 మంది మహిళల మత మార్పిడి? అదాశర్మ మూవీలో నిజమెంత?
మత మార్పిడి కథా నేపథ్యంగా తెరకెక్కిన ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం అత్యంత వివాదాస్పదంగా మారింది. టీజర్, ట్రైలర్లలో ఉన్న కంటెంట్ సంచలనం రేపడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లలో పేర్కొన్న మత మార్పిడి సంఖ్యను చిత్ర దర్శక, నిర్మాతలు మార్చి వేయడంతో మరింత వివాదాన్ని రేపుతున్నది. ఈ సినిమా స్క్రిప్టులో పేర్కొన్న వివరాలను మార్చి వేయడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఈ చిత్ర నిర్మాత, దర్శకులు అవాస్తవాలతో సినిమాను తెరకెక్కించారనే విషయంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ సినిమా వివాదాస్పద అంశాల వివరాల్లోకి వెళితే..
వివాదానికి కేంద్ర బిందువుగా ది కేరళ స్టోరి : ఇండియాలోని 32 వేల మంది అమ్మాయిలను ఐసీస్ (ISIS) ఇస్లాం మతంలోకి మార్చరనే విషయాన్ని ది కేరళ స్టోరి సినిమాలో పెట్టడం సంచలన రీతిలో వివాదంగా మారింది. అయితే సినిమా రిలీజ్‌కు ముందు యూట్యూబ్‌లోని ట్రైలర్‌లో కేరళలోని ముగ్గురు అమ్మాయిలను మాత్రమే మతమార్పిడికి పాల్పడ్డారనే విషయాన్ని పొందుపరిచారు. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు సినిమా దర్శకుడిని తూర్పారపడుతూ ట్రోల్ చేస్తున్నారు.

ట్రైలర్‌లో చెప్పిందేమిటంటే? : ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం ట్రైలర్‌లో ముందుగా పొందు పరిచిన వివరాలను మార్చి వేయడాన్ని నెటిజన్లు గ్రహించారు. ముందు చూపిన లెక్కలను, మార్చిన తర్వాత లెక్కలను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే తమ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతలు.. ఆ తర్వాత తమ లెక్కలు తప్పని తెలుసుకొని మార్చి వేయడంతో నెటిజన్లు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. అయితే ముందుగా సినిమా దర్శకుడికి, నిర్మాతకు అండగా నిలిచిన నెటిజన్లు ఒక్కసారిగా నివ్వెర పోయారు.
దర్శక, నిర్మాతలు చెప్పిందేమిటంటే? : ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్ర కథ విషయానికి వస్తే.. దర్శక, నిర్మాతలు ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని చెప్పారు. భారతీయ మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి ఐసీస్ మార్చారనే విషయాన్ని కథలో చెప్పారు. తొలుత 32000 మందిని ఇస్లాం మతంలోకి మార్చారని వెల్లడించారు. అయితే ఈ లెక్కలను తప్పు అని కొందరు బహిరంగంగానే ఖండించారు. అయితే సాక్ష్యాలు లేకపోవడంతో కొందరు నిజమేనని నమ్మారు.

రాజకీయ నేతల ఆగ్రహం : ది కేరళ స్టోరి (The Kerala Story) సినిమాను దేశంలోని పలు రాజకీయ పార్టీలు నిషేధించాలని డిమాండ్ చేశారు. కేరళ ముఖ్యమంత్రితోపాటు పలువురు రాజకీయ నేతలు ఈ సినిమాపై విమర్శలు చేశారు. మతం పేరుతో దేశాన్ని రెండు విభజించడానికి చేస్తున్న కుట్ర అని విమర్శించారు. ఈ సినిమా వివాదాల్లో కూరుకుపోవడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.

అదా శర్మతోపాటు నటించింది ఎవరంటే? : ది కేరళ స్టోరి (The Kerala Story) సినిమా విషయానికి వస్తే.. ఆదా శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇంకా ఈ చిత్రంలో యోగితా బిహాని, సిద్ది ఇద్నానీ, ప్రణయ్ పచూరి, చంద్రశేఖర్ దత్తా తదితరులు నటించారు. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించగా.. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











