twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త సినిమాల కథలకు ఇవే స్ఫూర్తి

    By Staff
    |

    ఆర్ట్‌ ఈజ్‌ ఇమిటేషన్‌ అన్నాడు ఆస్కార్‌ వైల్డ్‌. ఆ సూత్రాన్ని అక్షరాలా పాటిస్తున్న పరిశ్రమ భారతీయ చలనచిత్ర సీమ. ఇది చాలాకాలంగా జరుగుతునే ఉంది. ఈమధ్య ఇంటర్నెట్‌ పుణ్యమా అని భారతీయ సినిమా సృష్టికర్తలు ఎక్కడెక్కడి నుంచి ఏవేం కొట్టుకొస్తున్నారో ప్రేక్షకులకు తొందరగా తెలిసిపోతోంది. తెలుగులో ఇటీవల వచ్చిన చిత్రాలు, రానున్న చిత్రాలు వేటివేటికి స్ఫూర్తో ఇప్పుడు చూద్దాం.

    మెగాస్టార్‌ చిరంజీవి నటించిన స్టాలిన్‌ చిత్రానికి స్ఫూర్తి ఏదో ఈపాటికి చాలామందికి తెలిసిపోయింది. పే ఇట్‌ ఫార్వార్డ్‌ అనే చిత్రం స్ఫూర్తితో దర్శకుడు మురుగుదాస్‌ ఒక కథ అల్లి మెగాస్టార్‌కు చెప్పి ఒప్పించగలిగాడు. పే ఇట్‌ ఫార్వార్డ్‌లో ఓ ఆరేళ్ల కుర్రాడు మదిలో మెదిలే ఉన్నతమైన ఆలోచన అది. దాన్ని మెగాస్టార్‌కు ఆపాదించి తెరకెక్కించారు మురుగుదాస్‌. అతడి అంతకుముందు చిత్రం గజనీ కూడా మెమెంటో అనే ఆంగ్ల చిత్రానికి ఫ్రీమేక్‌.

    నాగార్జున బాస్‌ విషయానికి వస్తే.. దానికి స్ఫూర్తి హాలీవుడ్‌ చిత్రమైన - టూ వీక్స్‌ నోటీస్‌.

    అంతకుముందు మహేశ్‌బాబు నటించిన పోకిరి చిత్రానికి రామ్‌గోపాల్‌ వర్మ ఫ్యాక్టరీ వారి ఉత్పత్తి - డి - చిత్రం స్ఫూర్తి అని తెలిసింది.

    శ్రీకాంత్‌, నవీన్‌, శ్రీదేవి ప్రధాన తారాగణంగా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మి - చిత్రానికి గతంలో వచ్చిన హిందీ చిత్రం - దివాన్గీ మాతృక. అజయ్‌ దేవగన్‌ పాత్రను శ్రీకాంత్‌ పోషిస్తుండగా లాయర్‌గా అక్షయ్‌ ఖన్నా పోషించిన పాత్రను నవీన్‌ చేస్తున్నారు. ఆ చిత్రానికి ఫ్రీమేక్‌ ఆదిలక్ష్మి అన్న విషయం ఈమధ్యే బయటకు పొక్కింది.

    అలాగే, బజ్జూ ఆర్ట్స్‌ పతాకంపై వేణు, నరేశ్‌, పార్వతి మెల్టన్‌, మల్లికా కపూర్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న అల్లరే అల్లరి చిత్రం హిందీలో సల్మాన్‌ ఖాన్‌ కథానాయకునిగా, సుస్మితా సేన్‌, కత్రినా కైఫ్‌ నటించిన మైనే ప్యార్‌ క్యూం కియా అనే చిత్రాన్ని స్ఫూర్తిగా మరుధూరి రాజా రూపొందించిన కథే అని తెలుస్తోంది.

    చాలాకాలం తర్వాత సాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పైసాలో పరమాత్మ చిత్రం తెలుగులో ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ అయిన సినిమా అప్పు చేసి పప్పు కూడు చిత్రానికి కొంచెం అటు ఇటుగా ఉంటుందని తెలుస్తోంది.

    కథలు ఆలోచించడం మాని పదుల డివిడిలు ముందేసుకుని కథలు వండుతున్న ప్రస్తుత తరుణంలో ఆఖరికి సంగీతం కూడా కాపీయే అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. కొత్త సంగీత దర్శకులు ఎక్కువ మంది ఇళయరాజా మొదలు మంచి పాత ట్యూన్లను, కీర్తనల్ని అటుఇటుగా మార్చి కొత్త బాణీలుగా మనకి అందించేస్తుండటం గమనిస్తునే ఉన్నాం. ఇటీవల ఈ కాపీ ప్రక్రియ కూడా హైటెక్‌ రూపం సంతరించుకుంటోందని తెలిసింది. ఇంటర్నెట్‌లో రిమూవబుల్‌ డిస్క్‌లోకి కనీసం వందకు పైగా ఇతర భాషల ట్యూన్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని సంగీత దర్శకులకు అందిస్తే, వాటిలో నుంచి నచ్చినవి ఎత్తేసి.. బాణీలుగా ఇచ్చేసే వారు కూడా ఉన్నారని ఫిలింనగర్‌ భోగట్టా.

    కథలు కోసం కష్టపడే శ్రమ ఎటూ తప్పినప్పుడు కనీసం వాటిని అందంగా తెరకెక్కించడంలో అయినా సినిమా మేకర్లు జాగ్రత్త వహిస్తే.. ప్రేక్షకులకూ ఆనందమే. తద్వారా మరిన్ని విజయాలు కూడా వస్తాయి. కానీ అది కూడా కష్టమనుకుంటే ఇంకెవరు మాత్రం ఏం చేయగలరు?

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X