నా కోసం నెల రోజులు ఎదురుచూశారు.. సూపర్ హిట్ చిత్రం అలా మిస్సయింది.. నిహారిక!
మెగా డాటర్ నిహారిక తాజగా నటించిన చిత్రం సూర్యకాంతం. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక నిహారికకు సరైన సక్సెస్ అందలేదు. దీనితో నిహారిక ఆచి తూచి అడుగులు వేస్తోంది. తనకు సరిపడే చిత్రాలని మాత్రమే ఎంచుకుంటోంది. సూర్యకాంతం చిత్రంలో నిహారిక కామెడీ ట్రై చేస్తోంది. ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ విజయ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

చేతి వరకు వచ్చిన అవకాశం
ఒక్కోసారి మన చేతి వరకు వచ్చిన అవకాశాలు చేజారుతుంటాయి. అలాంటి అనుభవం నాక్కూడా ఎదురైంది అని నిహారిక అంటోంది. ఒకమనసు చిత్రంతో నిహారిక వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు యాంకర్ గా నిహారిక బుల్లి తెరపై తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. నటిగా మారిన తర్వాత నిహారికకు సరైన విజయాలు దక్కలేదు. శుక్రవారమే విడుదలైన సూర్యకాంతం చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది.

నేను శైలజ చిత్రంలో
హీరో రామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను శైలజ చిత్రం మంచి విజయం సాధించింది. రామ్ కు తప్పనిసరిగా హిట్ అవసరం అన్న సమయంలో నేను శైలజ చిత్రంతో విజయం సాధించి పరాజయాల నుంచి గట్టెక్కాడు. యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆ చిత్రం బాగా ఆకట్టుకుంది. ముందుగా ఆ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం తనని సంప్రదించారని నిహారిక తెలిపింది. ఆ సమయంలో సినిమాల్లో నటించేందుకు ఇంట్లో వాళ్ళని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నా. అందుకే అడిగిన వేంటనే ఒకే చెప్పలేకపోయా.

నెల రోజులు
నేను శైలజ చిత్రంలో నన్ను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు నెలరోజులు ఎదురుచూశారు. కానీ నా నుంచి సమాధానం రాకపోవడంతో ఆ అవకాశం కీర్తి సురేష్ చేతుల్లోకి వెళ్లిందని నిహారిక తెలిపింది. మనం వదులుకున్న చిత్రాలు విజయం సాధిస్తే.. అయ్యే ఆ చిత్రంలో నటించి ఉంటే బావుండేది అని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ అంగీకారంతో ఆ తర్వాత నిహారిక ఒక మనసు చిత్రంలో నటించింది.

సైరా నరసింహారెడ్డిలో
సూర్యకాంతం చిత్రం తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో చాలా చిన్న పాత్ర చేస్తున్నా అని నిహారిక తెలిపింది. పెదనాన్న ప్రతిష్టాత్మక చిత్రంలో ఎలాగైనా భాగం కావాలని చరణ్ అన్నని, దర్శకుడు సురేందర్ రెడ్డిగారిని అడిగి మరీ ఈ పాత్ర దక్కించుకున్నా అని నిహారిక చెబుతోంది. తనకు ఏళ్ల తరబడి నటించే ఉద్దేశం లేదని, నటించిన కొన్ని చిత్రాల్లో అయినా మంచి గుర్తింపు పొందాలని అనుకుంటున్నట్లు నిహారిక తెలిపింది.


Click it and Unblock the Notifications











