నిర్మాతతో గొడవ నిఖిల్‌కు మంచిదే.. అదిరిపోయే టైటిల్ పట్టేశారు, కొత్త పోస్టర్ కేక!
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ముద్ర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టి సంతోష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నిఖిల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నిఖిల్ కొత్తగా ట్రై చేసిన ప్రతి సారి మంచి విజయం దక్కుతోంది. ముద్ర చిత్రం కూడా వైవిధ్యభరితమైన కథతోనే వస్తోంది. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. ఇటీవల ముద్ర టైటిల్ విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ముద్ర చిత్ర టైటిల్ మార్చేశారు. ఈ చిత్రానికి చిత్ర యూనిట్ అర్జున్ సురవరం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

తీవ్ర వివాదం
ముద్ర చిత్ర టైటిల్ విషయంలో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్, నిఖిల్ మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. టైటిల్ నాదే అంటే నాది అంటూ ఇద్దరూ రచ్చకెక్కారు. నిఖిల్ నట్టి కుమార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడంతో నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిఖిల్ పై విమర్శల వర్షం కురిపించాడు. నిఖిల్ కు దమ్ముంటే ముద్ర టైటిల్ విషయంలో ఆధారాలతో చర్చకు రావాలని సవాల్ విసిరాడు.

గొడవ మంచిదే
ముద్ర టైటిల్ పై పూర్తి హక్కులు నావే అని నట్టి కుమార్ ఫిలిం ఛాంబర్, సెన్సార్ ధ్రువ పత్రాలని మీడియా ముందు ఉంచారు. దీనితో నిఖిల్ ముద్ర చిత్రం సందిగ్ధంలో పడ్డట్లు అయింది. దీనితో నిఖిల్ సినిమాకు టైటిల్ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. చిత్ర యూనిట్ తాజాగా ముద్ర చిత్రానికి 'అర్జున్ సురవరం' అని టైటిల్ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఓ పవర్ ఫుల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అర్జున్ సురవరం టైటిల్ క్యాచీగా, పవర్ ఫుల్ గా ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కేక పెట్టిస్తున్న పోస్టర్
ఫ్రెష్ లుక్, ఫ్రెష్ టైటిల్ అంటూ అర్జున్ సురవరం టైటిల్ తో పోస్టర్ విడుదల చేశారు. నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కెమెరా పట్టుకుని వ్యాన్ లో వెళుతున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో నిఖిల్ అర్జున్ లెనిన్ సురవరం అనే పేరుతో జర్నలిస్ట్ గా కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. సమాజంలో జరుగుతున్న ప్రధాన సమస్యలని అర్జున్ వెలుగులోకి తీస్తుంటాడని పేర్కొన్నారు. ముద్ర టైటిల్ అంతగా జనాలని ఆకర్షించలేదు. వివాదం తర్వాత చిత్ర యూనిట్ కు మంచి టైటిల్ దొరికింది.

విడుదల అప్పుడే
అర్జున్ సురవరం చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయనున్నారు. లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ కుమార్, కావ్య వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఇటీవల నిఖిల్ నటించిన చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో అర్జున్ సురవరం చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. ఠాగూర్ మధు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











