Karthikeya 3 త్వరలోనే కార్తీకేయ 3 మూవీ.. ప్యాన్ వరల్డ్ స్థాయిలో అంటూ ఘనంగా సెలబ్రేషన్స్
యువ హీరో నిఖిల్ సిద్దార్థ్, డైనమిక్ డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తీకేయ 2 చిత్రం భారీ విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్లను కుమ్మేసింది. 2022 సంవత్సరం ఆగస్టు 13న రిలీజైన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాసరెడ్డి, సత్య తదితరులు నటించారు. ఈ చిత్రం 2022 సంవత్సరంలో భారీ విజయం అందుకొన్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయిన సందర్శంగా తెలుగు మీడియాతో తమ ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్తీకేయ 3 గురించి హింట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగు మీడియాను కలుసుకొనేందుకు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని కార్తీకేయ 2 మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో హీరో నిఖిల్ సిద్దార్థ్, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్‌కేఎన్, వైవా హర్ష, యూనిట్ సభ్యులు హాజరయ్యారు.

కార్తీకేయ సక్సెస్‌ఫుల్‌గా ఏడాది పూర్తి చేసుకొన్నందుకు హీరో నిఖిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు మీడియా ఇచ్చిన రివ్యూల వల్లే పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తెలుగు మీడియా చేసిన సహకారం మరువలేనిది. మా సినిమాకు వెన్నంటి నిలిచారు. ఆ సమయంలో మేము కలుసుకోలేకపోయాం. ఈ సందర్భంగా మీతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలని అనుకొన్నాం అని నిఖిల్ అన్నారు.

దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. కార్తీకేయ 2 సినిమా విజయం మాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. మాలో మరింత విశ్వాసాన్ని నింపింది. మా కెరీర్‌లో కార్తికేయ 2 విజయం ఓ మైలురాయిగా నిలిచింది. త్వరలోనే కార్తీకేయ 3 సినిమా కూడా ఉంటుంది. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. నేను రెండు సినిమాలు ఒప్పుకొన్నాను. ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కార్తీకేయ 2 కంటే గ్రాండ్‌గా ఉంటుంది అని అన్నారు.

కార్తీకేయ 2 సక్సెస్ సెలబ్రేషన్‌లో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. నిఖిల్, చందూ కాంబినేషన్‌కు మంచి గుర్తింపు ఉంది. కార్తీకేయ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. కార్తీకేయ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయవంతమైంది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే కార్తీకేయ 3 చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో ఉండాలని కోరుకొంటున్నాను. ఈ సక్సెస్ సెలబ్రేషన్‌లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

కార్తీకేయ 2 సినిమా కలెక్షన్లు, బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రాన్ని సుమారు 20 కోట్ల రూపాయలతో రూపొందించారు. ప్రమోషన్, ఇతర ఖర్చులు కలిపి సుమారు 25 కోట్ల రూపాయలు అయింది. అయితే ఈ సినిమా ఘన విజయం సాధించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 121 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఓ చిన్న చిత్రం, అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయం సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.


Click it and Unblock the Notifications











