శివాజీ కొత్త చిత్రం నిక్కీ అండ్ నీరజ్
విజయాలు, వైఫల్యాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ సేఫ్ హీరోగా రాణిస్తున్న శివాజీ ఇప్పుడిప్పుడే టాటా బిర్లా మధ్యలో లైలా సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నారు. ఆయన తదుపరి చిత్రం నిక్కీ అండ్ నీరజ్ కూడా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది.
కల్పతరు మూవీ మేకర్స్ పతాకంపై కుమారి మేఘన ఇయ్యుని నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు పూర్ణ అడపాల (చంద్ర). శివాజీ సరసన దీప (మాయాజాలం ఫేమ్) నటిస్తున్నారు.
నిక్కీ అండ్ నీరజ్ షూటింగ్ ఇటీవలే పూర్తయిందని నిర్మాత తెలిపారు. వైజాగ్, అరకు ప్రదేశాలలోని అందమైన లొకేషన్లలో 14 రోజుల పాటు వివిధ సన్నివేశాలు, పాటలు చిత్రీకరించామని చెప్పారు. ఇప్పటికి నాలుగు పాటల చిత్రీకరణ పూర్తయింది. మరో పాటను నవంబర్ 20 నాటికి చిత్రీకరిస్తాం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసి.. డిసెంబర్ మొదటి వారంలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు మేఘన ఇయ్యుని.
సంగీతం నేర్చుకోడానికి అమెరికా నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిని చూసి హీరో ప్రేమలో పడతాడు. అతని ప్రేమని వెంటనే అంగీకరించని హీరోయిన్ అందుకు కొన్ని షరతులు పెడుతుంది. ప్రేమను దక్కించుకోడానికి హీరో ఏం చేశాడన్నది వినోదభరితంగా సాగుతుందని దర్శకుడు పూర్ణ వివరించారు.
ఈ చిత్రంలో ఐదు పాటలుంటాయి. ఘంటసాల పాడిన మరపురాని గీతం గోరంక గూటికే చేరావు చిలకా పాటను రీమిక్స్ గీతంగా ఈ చిత్రం ద్వారా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications