ఎన్టీఆర్, హరికృష్ణకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.. విషాదంలో నిమ్మకూరు!
Recommended Video

నందమూరి హరికృష్ణ నేటి ఉదయం నల్గొండ సమీపంలో అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు, సినీ వర్గాలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఊహించని శోకం ఎదురుకావడంతో హరికృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరులో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిమ్మకూరుతో అనుభందం
హరికృష్ణ వివాహం చేసుకునేంతవరకు కూడా నిమ్మకూరులోనే తిరుగుతుండేవారని గ్రామ ప్రజలు చెబుతున్నారు. చిన్నతనంలో హరికృష్ణతో సన్నిహితంగా మెలిగినవారంతా మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

అక్కడి అమ్మాయినే
హరికృష్ణ నిమ్మకూరుకు చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు. నిమ్మకూరులో ఉన్న బంధువులు, మిత్రులతో కలివిడిగా ఉండేవారని అంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత కూడా నిమ్మకూరు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యేలా చేశారని గ్రామ ప్రజలు తెలిపారు.

ఎన్టీఆర్ తరువాత
నిమ్మకూరు గురించి ఎన్టీఆర్ కు పూర్తిగా తెలుసు. వారి కుటుంబంలో ఎన్టీఆర్ తరువాత ఈ గ్రామం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి హరికృష్ణే అని గ్రామ ప్రజలు అంటున్నారు. ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది.. స్నేహితుల పేర్లు, ఊరి విశేషాలు ఈ వివరాలన్నీ హరికృష్ణకు బాగా తెలుసు. నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, హరికృష్ణకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ బంధువులు
నిమ్మకూరులో ఉన్న ఎన్టీఆర్ బంధువులు హరికృష్ణ ని చివరిసారి చూసేందుకు హైదరాబాద్ బయలుదేరారు. నిమ్మకూరులో హరికృష్ణ స్నేహితులు, బంధువులు ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











