పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నాకు రెండు కళ్లు.. వాళ్లే ధైర్యం, దమ్ము.. నితిన్ ఎమోషనల్ స్పీచ్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత నాగవంశీ సూర్యదేవర నిర్మాణ సారథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగ్ దే. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 26 తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నితిన్ మాట్లాడుతూ...

ఆ రోజు పవన్ కల్యాణ్ ముందు...
2016లో శిల్పకళావేదికకు వచ్చిన రోజు ఇంకా గుర్తుంది. అఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీరంతా పైన ఉంటే, నేను వేదికపై ఉన్నాను. వేదిక ముందు పవన్ కల్యాణ్ గారు ఉన్నారు. ఆ ఈవెంట్‌లో గురువు త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు ఇంకా గుర్తుకొస్తున్నాయి అని నితిన్ అన్నారు.

మూడు ఫ్లాఫులున్న సమయంలో
ఇక సినిమా యూనిట్ గురించి మాట్లాడుతూ.. నాకు తండ్రి రోల్ పోషించాలంటే అది నరేష్ మాత్రమే. ఆయన అందుబాటులో లేకుంటే మరొకరు నటిస్తారు. నాకు తల్లిగా రోహిణి నటించారు. భీష్మకు ముందు నాకు మూడు ఫ్లాఫులు ఉంటే వెన్నెల కిషోర్ నటించి నాకు హిట్ ఇచ్చారు అని నితిన్ పేర్కొన్నారు.

కీర్తి సురేష్ కంటే అందంగా
రంగ్ దే సినిమాలో నా క్యారెక్టర్ వయసు 24 ఏళ్లు. కానీ వాస్తవంగా నా వయసు 36 సంవత్సరాలు. అయితే నేను స్టూడెంట్‌గా పనికి వస్తానా అనే డౌట్ ఉండేది. కానీ నాకు భయాన్ని పొగొట్టింది సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం గారు. నన్ను చాలా అందంగా, యువకుడిగా చూపించారు. కీర్తి సురేష్ కంటే నేనే అందంగా ఉన్నాను. అందుకు ఆయనకు థ్యాంక్స్ అని నితిన్ అన్నారు.

దేవీ శ్రీ ప్రసాద్‌తో నితిన్, కీర్తి డ్యాన్స్
దేవీ శ్రీ ప్రసాద్‌తో పనిచేయడం ఇదే తొలిసారి. ప్రతీ పాట చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఆల్బమ్‌ను దాచుకొనేంతగా మ్యూజిక్ ఇచ్చారు అని చెప్పారు. ప్రేక్షకులు డీఎస్పీ డ్యాన్స్ చేయాలని డిమాండ్ చేయడంతో వేదికపై నితిన్, దేవీ, కీర్తి సురేష్ కలిసి డ్యాన్స్ చేశారు.

పవన్, త్రివిక్రమ్ నాకు రెండు కళ్లు
నా భార్యపై ప్రేమను పక్కన పడితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాకు చెప్పలేనంత ప్రేమ. సినిమా ఇండస్ట్రీలో నాకు రెండు కళ్లు ఎవరంటే ఒకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రెండోది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వీళ్లు నా వెనుక ఉన్నారు. అదే ధైర్యం, అదే దమ్ము అని నితిన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











