జెండా పాతిన పవన్ కళ్యాణ్, మరి పీకేది ఎవరో?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీసు వద్ద తన స్టామినా ఏ రేంజిలో ఉంటుందో మరోసారి నిరూపించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి గుండెకాయలాంటి నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డుతో ఇప్పటి వరకు ఉన్న 'మగధీర' జెండా పీకేసి.... పవన్ 'అత్తారింటికి దారేది' విజయ జెండా పాతినట్లయింది.
గతంలో 'మగధీర' చిత్రం నైజాం ఏరియాలో అత్యధికంగా రూ. 24.80 కోట్లు వసూలు చేసింది. తాజాగా 'అత్తారింటికి దారేది' షేర్ విలువ కేవలం 6 వారాల్లోనే రూ. 25 కోట్లు దాటింది. ఇక సినిమా మొత్తం బిజినెస్ పూర్తయ్యే నాటికి మరొక కోటి నుంచి రెండు కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అన్ని ఏరియాల్లో కలిసి సినిమా మొత్తం షేర్ రూ. 80 కోట్లు క్రాస్ అయింది.
కాగా నైజాం ఏరియాలో పవన్ సినిమా నెలకొల్పిన ఈ సరికొత్త రికార్డును ఎవరు బీట్ చేస్తారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ బాబు '1-నేనొక్కడినే' చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తున్న నేపథ్యంలో..... అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరి ఈ సినిమా సత్తా ఎంతో సంక్రాంతి వస్తే గానీ తెలియదు.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












