పవన్ మేనియా : కటౌట్లపై చిరంజీవికి దక్కని చోటు!
హైదరాబాద్ : మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా ఆడియో ఫంక్షన్ జరిగినా అక్కడ తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి కటౌట్ కనిపిస్తుంది. కానీ తాజాగా జరిగిన పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో వేడుకలో మాత్రం మెగాస్టార్ కటౌట్‌కు స్థానం లేకుండా పోయింది.
గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.....ఈ ఆడియో వేడుకకు మెగా కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాలేదు. అసలు నిర్వాహకులు వారెవరికీ ఆహ్వానాలు కావాలనే పంపలేదని తెలుస్తోంది. మరి ఈ నిర్ణయం వెనక కారణం ఏమిటి? అనేది అంతు పట్టడం లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని మించిపోయాడా? మెగా అభిమానులు ఇప్పుడు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది మెగా అభిమానుల తీరు చూస్తుంటే. ఇటీవల జరిగిన 'ఎవడు' ఆడియో ఫంక్షనే ఇందుకు నిరద్శనం.
'ఎవడు' ఆడియో వేడుక మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రావాలంటూ నినాదాలు చేసారు. అయితే యాంకర్లు వేణుమాధవ్, సుమ.....పవన్ ఎందుకు రాలేక పోయారో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయినా అభిమానులు వినిపించుకోలేదు. చిరంజీవి ఆడిటోరియంలోకి ఎంటరైన కూర్చీలో కూర్చున్న తర్వాత కూడా 'వి వాంట్ పవన్ కళ్యాణ్' అంటూ మరో సారి నినాదాలు చేసారు అభిమానులు. దీంతో చిరంజీవి ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూసారు. అయినా వారి నినాదాలు ఆగలేదు.
తాజాగా...జరిగిన 'అత్తారింటికి దారేది' ఆడియో వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు పూర్తిగా పవర్ స్టార్ భజనతోనే గడిపారు. ఏ ఒక్కరు కూడా చిరంజీవి గురించి కానీ, ఇతర హీరోల గురించి అసలు మాట్లాడక పోవడం గమనార్హం. ఈ పరిణామాలు చూస్తుంటే ఎక్కడో తేడా కనిపిస్తోందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.


Click it and Unblock the Notifications











