చిరంజీవితో విభేదాలు లేవు : దాసరి
హైదరాబాద్ : చిరంజీవితో తనకు ఎలాంటి విబేధాలు లేవని దర్శక రత్న దాసరి నారాయణరావు స్పష్టం చేసారు. మీడియానే అనవసర రాద్దాంతం చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం 'భాషాతో నేను' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నేను చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి ఏమాత్రం కాదని దాసరి వివరణ ఇచ్చారు.
దాసరి కామెంట్స్ నేపథ్యంలో....ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఇందులో చిరంజీవి సోదరుడు నాగబాబు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సదరు ఛానల్ కు ఫోన్ చేసిన దాసరి తన వ్యాఖ్యలు చిరంజీవిని టార్గెట్ చేస్తూ కాదని స్పష్టం చేసారు. మరి ఎవరిని ఉద్దేశించి చేసారు అనే విషయం దాసరి పుస్తకం రాస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.
నిన్న దాసరి చేసిన వ్యాఖ్యలు...
'సౌతిండియాలో ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, రజనీకాంత్‌లే సూపర్ స్టార్లు, సూపర్ స్టార్లను మించిన స్టార్లు లేరు. నా చేతుల మీదుగా ఎంతో మంది స్టార్స్ అయ్యారు. నేను ఎంతో మందిని స్టార్స్ చేసాను. నా సినిమాల్లో ఒక్క చాన్స్ కోసం ఎదురు చూసిన వారు...నేడు నేనొస్తే దాసరి నారాయణరావు లేచి నిలబడడా? అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. నన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. అది వాళ్ల నైజం....కానీ రజనీలో అలాంటి వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వంలో ఇప్పుడున్న స్టార్స్ ఎవరూ ఆయనకు సాటిరారు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న వారి అందరి చరిత్రలు నాకు తెలుసు. త్వరలో పుస్తకం రాస్తా, నిజాలు రాస్తా, అందరి చరిత్రలు బయట పెడతా' అంటూ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











