తమన్నా సినిమా పరిస్థితి ఏంటి.. దర్శకుడి పేరు లేకుండానే!
కంగన రనౌత్ నటించిన క్వీన్ చిత్రం బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. కంగనా నటనకు అనేక ప్రశంసలు దక్కాయి. తెలుగులో ఈ చిత్రం దట్ ఈజ్ మహాలక్ష్మి పేరుతో తెరకెక్కుతోంది. మను కుమారన్ ఈ చిత్రానికి నిర్మాత. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. రాజమండ్రి నుంచి ఓ అమ్మాయి ఒంటరిగా పారిస్ కు హనీమూన్ కు వెళుతుంది. ఈ తెలుగు అమ్మాయి అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, వాటిని ఎలా అధికమించింది అనేదే ఈ చిత్ర కథ. కాగా ఈ చిత్ర విషయంలో ఇటీవల వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

నాలుగు భాషల్లో
క్వీన్ చిత్రాన్ని సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు తెలుగులో తమన్నా నటిస్తోంది. తమిళంలో అందాల చందమామ కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.. మలయాళంలో మంజిమ మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ నటిస్తున్నారు. నాలుగు భాషల్లో ఒకరే నిర్మాత. కానీ వేరు వేరు దర్శకులు పనిచేస్తున్నారు.

తెలుగులో విభేదాలు
తెలుగులో క్వీన్ చిత్రం దట్ ఈజ్ మహాలక్ష్మిగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు నీలకంఠ, తమన్నా మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో నీలకంఠ కొంత భాగం షూటింగ్ ముగిసిన తర్వాత తప్పుకున్నారు. మిగిలిన భాగానికి అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి విచిత్ర పరిస్థితిని నెలకొని ఉంది. ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో దర్శకుడిగా ఎవరి పేరు వేయాలో చిత్రయూనిట్ కి అర్థం కావడం లేదు.

దర్శకుడి పేరు లేకుండానే
ప్రస్తుతం ఈ చిత్రానికి విడుదలవుతున్న పోస్టర్స్ అన్ని దర్శకుడి పేరు లేకుండా వస్తున్నాయి. సినిమాలో కూడా డైరెక్టర్ పేరు లేకుండా ప్రదర్శిస్తారనే ప్రచారం జరుగుతుంది. అలా జరిగితే దర్శకుడి పేరు లేని అరుదైన చిత్రంగా దట్ ఈజ్ మహాలక్ష్మి మిగిలిపోతుంది. హీరోయిన్ పాత్రే ప్రధానంగా ఉండే ఈ చిత్రంలో తమన్నా తన నటనతో అదరగొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితే
కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక చిత్రం విషయంలో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. కంగనా రనౌత్, క్రిష్ మధ్య విభేదాలు తలెత్తడంతో క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. మిగిలి భాగానికి కంగనా దర్శత్వం వహించింది. ఇప్పుడు చిత్రం విడుదలయ్యాక నేనే ఎక్కువభాగం చిత్రీకరించానని క్రిష్, కంగన ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











