Filmfare Awards: చిరంజీవి, బాలయ్య, ప్రభాస్ సినిమాలకు దక్కని ఫిలింఫేర్.. ఎందుకిలా?
కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించి చిత్రాలు తీసే సినిమా రంగంలో అభిమానుల ఆదరణ, భారీ వసూళ్లు, విమర్శకుల ప్రశంసలు సహజం. కానీ తమ నటనకు, కష్టానికి ఏదైనా అవార్డ్ వస్తే బాగుండు కదా అని నటీనటులు అనుకుంటూ ఉంటారు. బయటపడకపోయినా ఇది పచ్చినిజం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులు నటీనటుల గౌరవాన్ని పెంచుతాయి. అందుకే జీవితంలో ఒక్కసారైనా స్టేజ్ మీద ఏదో ఒక పురస్కారాన్ని అందుకోవాలని సినీ ప్రముఖులు భావిస్తుంటారు. నవరసాలు అద్భుతంగా పలికించినా, జనం చేత జేజేలు అందుకున్నా .. ఏ అవార్డుకు నోచుకొని వారెందరో. కొందరు ఈ విషయంలో ఓపెన్ అయిన సందర్భాలు లేకపోలేదు.
ఇదిలా ఉండగా.. 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు తరలివచ్చారు. తెలుగు విషయానికి వస్తే బలగం ఉత్తమ చిత్రంగా నిలవగా.. ఉత్తమ దర్శకుడిగా వేణు పురస్కారాన్ని అందుకున్నారు. దసరాలో నటనకు గాను నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్‌లకు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు.

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కేటగిరిలో శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యవ్ (హాయ్ నాన్న) నిలిచారు. ఉత్తమ సహాయ నటులుగా రవితేజ (వాల్తేర్ వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ) పురస్కారాలను అందుకున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్‌లో సత్తా చాటడటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే దసరా చిత్ర యూనిట్, ఇతర అవార్డులు అందుకున్న వారిని సీఎం అభినందించారు. పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ విషెస్ తెలిపారు.
అయితే మిడిల్ రేంజ్, చిన్న సినిమాలకు ఫిల్మ్‌ఫేర్‌లో అవార్డుల పంట పండటం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది. ఏ టాలీవుడ్ పెద్ద స్టార్ సినిమాకు ఈ లిస్ట్‌లో చోటు లభించకపోవడం ఆశ్యర్యం కలిగించింది. గతేడాది చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వంటి అగ్రనటులు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలేవీ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను రాబట్టలేకపోవడం విమర్శకులకు, ఆయా హీరోల అభిమానులకు మింగుడుపడటం లేదు.

గతేడాది సంక్రాంతి సీజన్‌లో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి.. చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్యలు రిలీజై ఘన విజయాన్ని అందుకున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కూడా వీఎఫ్ఎక్స్‌తో సందడి చేసింది. కానీ ఈ చిత్రాలకు ఏ ప్రధాన విభాగంలోనూ ఫిలింఫేర్ అవార్డులు రాలేదు. ఇది వారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
కేవలం వాల్తేర్ వీరయ్యలో సపోర్టింగ్ రోల్ చేసిన రవితేజ ఒక్కరికే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ రావడం ఆ చిత్ర యూనిట్‌కు ఊరట కలిగించే విషయం. ఇలా ఎందుకు జరుగుతోందో.. చిన్న సినిమాలే అవార్డులను ఎందుకు కైవసం చేసుకుంటున్నాయో మేకర్స్ అర్ధం చేసుకుంటే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











