జూ.ఎన్టీఆర్ కు స్ధానం లేదా..కేవలం బాలయ్యేదే
హైదరాబాద్ : బాలకృష్ణ తన పుట్టిన రోజు సందర్భంగా నందమూరి డాట్ కాం అనే వెబ్ సైట్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ వెబ్ సైట్ లో నందమూరి వంశానికి చెందిన మొత్తం వివరాలు ఉంటాయని అంతా ఆశించారు. కానీ ఆ సైట్ కేవలం పెద్ద ఎన్టీఆర్,బాలకృష్ణ లకే పరిమితమైంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్,జూ.ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్దావన కూడా లేదు. అదే విషయం ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు. నిజానికి బాలకృష్ణ తన అభిమానులు కోసం ఏర్పాటు చేసిన సైట్ కావటంతో అందులో నిజానికి మిగతా వివరాలు ఉండాల్సిన అవసరం లేదని కొందరంటున్నారు.
ఈ వెబ్ సైట్ గురించి బాలయ్య మాట్లాడుతూ... అందరూ మహానుభావులు కాలేరు. అలా అవ్వాలంటే సత్సంకల్పం, అకుంఠిత దీక్ష, తన దారిలో జనాన్ని నడిపించే శక్తి కావాలి. ఏమీ ఆశించకుండా అభిమానులు ఆశీర్వదించడమే నాకు శ్రీరామరక్ష. అది ఎప్పటికీ విడదీయలేని రుణానుబంధం. అన్ని మతాలు, అన్ని కులాలకు చెందినవాళ్లు నా అభిమానులు కావడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. అభిమానుల్ని పొందడమనేది నా పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావించుకుంటున్నాను. మీరంతా చెల్లాచెదురుగా కాకుండా ఒక గొడుగు కింద ఉండటం కోసం సొంతంగా నందమూరి డాట్ కామ్ అనే అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించాను అన్నారు.
అలాగే... అభిమానులు చేస్తున్న సేవలు కేవలం ఒక ప్రాంతానికే కాకుండా అందరికీ తెలియడం కోసం, వారిలో స్ఫూర్తిని కలిగించడం కోసం, అందరూ గర్వపడేలా ఈ వెబ్‌సైట్ ని రూపొందించడం జరిగింది. అలాగే ఏ ప్రాంతంలోనైనా కరువు కాటకాలు, వరదలు వంటి విపత్తులు కలిగినప్పుడు మనం కలిసికట్టుగా సమాజానికి ఏదైనా చేసేందుకు నేను మీతో పాటు రంగంలోకి దిగటానికి మన మధ్య ఓ వారధి ఈ వెబ్‌సైట్.
ఇందులో నమోదు కానివాళ్లు నా అధికారిక అభిమానులు కారు. అభిమాన సంఘాల ద్వారా ఇందులో నమోదైన ప్రతి ఒక్క అభిమానికీ గుర్తింపు కార్డు ఇస్తాం. అభిమాన సంఘాల్లో నా అభిమానులను సభ్యులుగా చేర్పించేందుకు జిల్లాల వారీగా, మండలాల వారీగా, పంచాయితీల వారీగా కమిటీలను వేశాం. నేనీ స్థాయికి రావడానికి కారణం అభిమానులు అని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











