తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే ఇరగ్గొడతాం .. రోజాకు టీడీపీ నేత ఆనం వార్నింగ్
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్న క్షేత్రం తిరుమల. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతూ.. భక్తుల పాలిట కష్టాలు తీర్చే కోనేటిరాయుడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. రెప్పపాటు దర్శనమైనా చాలు తమ జన్మధన్యమైందని భావించే కొట్లాది మంది భక్తులు.. అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది తిరుమల. సామాన్యులతో పాటు దేశాధినేతలు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు స్వామి వారి సేవలో తరిస్తూ ఉంటారు.
అంతటి విశిష్టత ఉన్న తిరుమల కొన్నేళ్లుగా రాజకీయాలకు వేదికగా మారుతోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక తిరుమల క్షేత్ర నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తిరుమల గిరులలో అన్యమత ప్రచార ఘటనలు ఎక్కువయ్యాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వెనుక ఉన్న చెట్లకు ఏసుక్రీస్తు సిలువ గుర్తులు కనిపించడం కలకలం రేపింది. అలాగే ఇతర మతాలకు చెందిన స్టిక్కర్లతో కూడిన వాహనాలు ఘాట్ రోడ్‌లోకి ప్రవేశించిన దాఖలాలు కూడా ఉన్నాయి.

వీటిని పక్కనబెడితే.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రాజకీయ ప్రముఖులు వచ్చామా , వెళ్లామా అన్నట్లు కాకుండా ఆలయం పక్కనే నిలబడి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సినీనటి , మాజీ మంత్రి రోజా తీరు ఎన్నోసార్లు వివాదాస్పదమైంది. విపరీతంగా రద్దీ ఉండే సమయాల్లో రోజా దర్శనానికి వచ్చేవారు. ఆవిడ ఒక్కరే వస్తే ఏ ఇబ్బంది లేదు.. వెంట మందీ మార్బలంతో దిగేవారు.
మంత్రి గారి వెంట వచ్చే వారికి వీఐపీ ప్రోటోకాల్ , బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేయకుంటే ఆమె ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయంతో టీటీడీ అధికారులు మౌనదాల్చక తప్పలేదు. ఒకానొక సందర్భంలో రోజా దాదాపు 30 మంది అనుచరులతో తిరుమల ఆలయంలో హల్‌చల్ చేశారు. తన అనుచరగణానికి దర్శనం పూర్తయ్యే వరకు దాదాపు గంటపాటు రోజా ఆలయంలోనే గడిపారు. నెలకు నాలుగైదు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే రోజా కారణంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దర్శనంతోనే రోజా సరిపెట్టేవారు కాదు.. ఆలయం బయటికి వచ్చి మీడియా కెమెరాలకు ఫోజులు ఇచ్చి, టీడీపీ నేతలపై విరుచుకుపడేవారు. అది కూడా ఘాటు పదజాలంతో. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అంతే పవిత్రంగా ఉండాల్సిందిపోయి ఇలా వ్యవహరించడమేంటని కొందరు విమర్శించేవారు. బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వంటి వారైతే.. తిరుమలలో రాజకీయ విమర్శలు చేసేవారిని తిరుపతిలోనే అడ్డుకుంటామని హెచ్చరించారంటే రోజా వంటి వారు పరిస్ధితులను ఎలా దిగజార్చారో అర్ధం చేసుకోవచ్చు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారికి అపరాధ రుసుము విధించాలని, ఆ సొమ్మును స్వామి వారి హుండీల్లో వేయాలని కూడా భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
అయినప్పటికీ రోజా తీరులో ఎలాంటి మార్పు లేదు. చివరికి రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి రెండు రోజుల ముందు కూడా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని, యథావిధిగా నోటికి పనిచెప్పారు. ఏపీ ప్రజలు కూటమిని నమ్మే పరిస్ధితి లదేని, మరోసారి వైసీపీ పట్టం కడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబట్టారని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎలా అడ్డుకోలేరో, వైసీపీ విజయాన్ని కూడా అలాగే ఆపలేరని రోజా పేర్కొన్నారు.

అయితే మంగళవారం విడుదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంపై టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తిరుమలలో రోజా రాజకీయాలు మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ్టీ నుంచి తిరుమలలో నేతలు రాజకీయాలు మాట్లాడకూడదని హెచ్చరించారు. టీడీపీ వాళ్లైనా, వైసీపీ వాళ్లైనా తిరుమలలో శ్రీవారి గురించి తప్పితే, వేరే సబ్జెక్ట్ మాట్లాడితే ఇరగ్గొడతామని పరోక్షంగా రోజాకు వెంకట రమణా రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











