ఫ్యాన్స్‌కు హుషారెత్తించే వార్త.. బన్నీ సినిమా గురించి పుకార్లు, త్రివిక్రమ్ సరికొత్తగా!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం విడుదలై 6 నెలలు గడుస్తున్నా ఇంత వరకు కొత్త సినిమా గురించి ప్రకటన రాలేదు. బన్నీ అభిమానులు ఎప్పటి నుంచో బన్నీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ఏ ఫంక్షన్ కు హాజరైనా ఈ ప్రశ్న ఎదురవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఉండబోతోందని కొన్ని రోజులుగా బలమైన వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనేది లేటెస్ట్ టాక్. ఈ కాంబినేషన్ గురించి జరుగుతున్న కొన్ని పుకార్లకు కూడా తాజాగా తెరపడింది.

హ్యాట్రిక్ మూవీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ చిత్రానికి సంబంధించి అతి త్వరలోనే ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డిసెంబర్ కల్లా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తి చేస్తాడని అంటున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం హడావిడిగా సినిమా చేసే ఉద్దేశంలో లేడట. అంతా సిద్ధం అయ్యాక రంగంలోకి దిగాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ తన కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు.

బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతంగా ఓ కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శత్వంలో బన్నీ రీమేక్ నటించబోతున్నాడని ఇటీవల తెగ ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదనేది తాజా సమాచారం. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నాడట. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆ ప్రచారానికి కారణం బన్నీనే
బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ హిందీ సూపర్ హిట్ మూవీ 'సోనుకే టిటు కి స్వీటీ'ని రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పుకార్లు వ్యాపించడానికి అల్లు అర్జునే కారణం అని తెలుస్తోంది. ఈ చిత్రం అల్లు అర్జున్‌కు చాలా బాగా నచ్చిందట. ఈ చిత్రం గురించి బన్నీ త్రివిక్రమ్‌తో చర్చించడంతో రీమేక్ చేస్తున్నారనే ప్రచారం మొదలైందని అంటున్నారు. కానీ వీళ్లిద్దరికీ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించడం ఇష్టం లేదని సమాచారం.

అభిమానులకు దగ్గరగానే
తన చిత్రం విడుదలై చాలా రోజులు గడుస్తున్నా బన్నీ అభిమానులకు దగ్గరగానే ఉంటున్నాడు. కొన్ని సినిమా వేడుకలకు హాజరు కావడంతో ద్వారా అభిమానులని సంతృప్తి పరుస్తున్నాడు. బన్నీ చివరగా నటించిన నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచింది. అంతకు ముందుకు వచ్చిన డీజే కూడా యావరేజ్ గానే నిలిచింది. దీనితో తదుపరి చిత్రం తప్పకుండా ఘనవిజయాన్ని సొంతం చేసుకోవాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











