తెలుగులో ఆ సినిమాకి థియేటర్లు లేవు: పాపం తెలుగు రిలీజ్ ఆగిపోయింది
గృహం సినిమాకు తెలుగులో థియేటర్లే ఇవ్వట్లేదు. హైదరాబాద్‌కు వచ్చి థియేటర్ల సంగతి తేల్చుకునే వీలు లేకపోయింది. దీంతో తెలుగులో రిలీజ్ ఆపుకోక తప్పట్లేదు.
తెలుగులో కొన్నెళ్ళక్రితం దాకా సక్సెస్ఫుల్ హీరోగా రాణించాడు సిద్ధార్థ్, తమిళుడే అయినా టాలీవుడ్ లోనూ హీరోగా ఎక్కువ పేరు సంపాదించాడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా? బొమ్మరిల్లు లాంటి స్ట్రైట్ సినిమాలు తీసేంత పాపులర్ అయ్యాడు. కానీ పాపం తర్వాత మాత్రం ఆ స్టార్ డమ్‌ని నిలబెట్టుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయి తర్వాత మళ్ళీ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు కానీ అక్కడకూడా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలేం లేకపోవటం తో చాలాకాలంగా సైలెంట్ అయిపోయాడు.

ఇటాకి ఎంటర్టైన్మెంట్స్
ఎక్కువ ఆఫర్స్ రాకపోవటంతో తానే ఒక సొంత బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించటం మొదలు పెట్టాడు. ‘ఇటాకి ఎంటర్టైన్మెంట్స్' పేరుతో ఒక బేనర్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బేనర్ మీదే రెండు మూడు సినిమాలు నిర్మించాడు.

నవంబరు 3న ఒకేసారి మూడు భాషల్లో
ఇప్పుడు సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన హార్రర్ మూవీ ‘గృహం' కూడా ఈ బేనర్ నుంచి వస్తున్నదే. సిద్దార్థ్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఓ హార్రర్ మూవీ తీసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆ చిత్రానికి ‘గృహం' అనే పేరు పెట్టారు. ఈ సినిమాను నవంబరు 3న ఒకేసారి మూడు భాషల్లోనూ రిలీజ్ చేయాలనుకున్నాడు సిద్ధు.

రిలీజ్ ఆపుకోవాల్సి వచ్చింది
హైదరాబాద్ వచ్చి నాని ముఖ్య అతిథిగా ఓ ఈవెంట్ కూడా చేశాడు. హార్రర్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ శుక్రవారం ఈ సినిమా చూసే అవకాశం వారికి దక్కట్లేదు. సిద్ధు సినిమాకు ఈ వారం తెలుగులో ఆశించిన స్థాయిలో థియేటర్లు ఇవ్వకపోవడంతో రిలీజ్ ఆపుకోవాల్సి వచ్చింది.

థియేటర్లే ఇవ్వట్లేదు
తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజవుతుండటంతో ప్రమోషన్లు, ఇతర రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే అతడి సినిమాకు థియేటర్లే ఇవ్వట్లేదు. హైదరాబాద్‌కు వచ్చి థియేటర్ల సంగతి తేల్చుకునే వీలు లేకపోయింది. దీంతో తెలుగులో రిలీజ్ ఆపుకోక తప్పట్లేదు.

ఉన్నది ఒకటే జిందగీ
గత రెండు వారాల్లో వచ్చిన ‘రాజా ది గ్రేట్'.. ‘ఉన్నది ఒకటే జిందగీ'లకు బలమైన బ్యాకప్ ఉండటంతో ఈ వీకెండ్లో కూడా వాటిని చాలా చోట్ల కొనసాగిస్తున్నారు. ఇక ఈ వీకెండ్లో ‘గరుడవేగ'.. ‘నెక్స్ట్ నువ్వే'.. ‘ఏంజెల్' సినిమాలు రిలీజవుతున్నాయి.

తెలుగు రిలీజ్ ఆగిపోయింది
వీటికే థియేటర్ల కొరత కనిపిస్తోంది. ఇక డబ్బింగ్ సినిమాకు ఎక్కడ థియేటర్లిస్తారు? ఈ పరిస్థితుల్లో సిద్ధు సినిమా తెలుగు రిలీజ్ ఆగిపోయింది. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంటుగా ఉన్న సిద్ధు.. ఆ తర్వాత మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











