బెల్లంకొండ 'సారి' చెప్పినా ఫలితం లేదు??
కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పై బెల్లంకొండ సురేష్ చెయ్యచేసుకుని, పీక నొక్కి చంపేస్తానని బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఏడవ తేదీన ఈ మేరకు దర్శకుడు ఎపీ ఫిల్మ్ డైరక్టర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేసారు. దాంతో అత్యవసరంగా సమావేశమైన కార్యవర్గం విస్తృతంగా చర్చించి,నిర్మాతను వాదన వినిపించమని అడిగింది. కో ఆర్డినేషన్ కమిటి ఛైర్మన్ కె.ఎల్ నారాయణ ఆధ్వర్యంలో 9వ తేదీన బెల్లంకొండ సురేష్ దర్శకులు సంఘానికి వచ్చి తన వాదన వినిపించారు. తాను చెయ్యచేసుకోలేదని అన్నారు.
అయితే ఇద్దరి వాదనలు విన్న సంఘం.. బెల్లంకొండ సురేష్ చెయ్యి చేసుకునే ఉంటాడని నిర్ధారించింది. దాంతో క్షమాపణ పత్రాన్ని బెల్లంకొండ రాసి ఇచ్చారు. అంతా సమస్య పరిష్కారం అయ్యింది. సినిమా ప్రారంభమవుతుంది అనుకున్నారు. అయితే దర్శకుడు శ్రీనివాస్ మాత్రం తాను చేయనని ఖచ్చితంగా చెప్పేసారు. తనపై చెయ్యి చేసుకున్న వ్యక్తితో తాను సినిమా చేయలేనని తేల్చి చెప్పాడు. దాంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లు అయ్యింది. ఇక రామ్ హీరోగా రూపొందించిన కందిరీగ తో సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు అయ్యారు. ముందుగా చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం రామ్ హీరోగా మరో చిత్రాన్ని శ్రీనివాస్ తెరకిక్కిస్తున్నారు.
బెల్లంకొండ సురేష్ కి, సంతోష్ శ్రీనివాస్ కి మధ్య వివాదం రెమ్యునేషన్ విషయంలో తలెత్తిందని,రెమ్యునేషన్ విషయంలో మాట మాట రావటంతో కోపగించిన బెల్లంకొండ సురేష్ .. వెంటనే ఆవేశంలో శ్రీనివాస్ ని కొట్టాడని తెలుస్తోంది. దర్శకుడుగా సంతోష్ శ్రీనివాస్ కి లైఫ్ ఇచ్చిన బెల్లంకొండకు రెమ్యునేషన్ విషయంలో శ్రీనివాస్ పట్టుబట్టడంతో పట్టరాని కోపం వచ్చే చెయ్య జారాడని చెప్పుకుంటున్నారు.
అయితే కొన్ని మీడియా వర్గాలు...ఇప్పుడు కొత్తగా రూపొందిస్తున్న చిత్రం స్క్రిప్టు సెకండాఫ్ లో మార్పులు చేయమని బెల్లంకొండ అడిగాడని దానికి శ్రీనివాస్ ఒప్పుకోకపోవటం ఈ వివాదానికి కారణమని తేలుస్తున్నాయి. హీరో రామ్ ఒప్పుకున్నాడు కాబట్టి మళ్లీ మళ్లీ స్క్రిప్టు మార్పులు చేయవద్దని శ్రీనివాస్ కోరడంతో వివాదం పెద్దదయిందని చెప్పుకుంటున్నారు. ఇక గతంలో రామ్ కి,బెల్లంకొండ సురేష్ కి మధ్య కూడా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మొదట ఒప్పుకున్న రెమ్యునేషన్ ఎగ గొట్టాడని కందిరీగ విడుదల అయ్యాక రామ్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసి వసూలు చేసుకున్నారు.
గతంలోనూ ప్రియమణి వంటి వారు ఇలా రెమ్యునేషన్ విషయంలో బెల్లంకొండతో గొడవలు జరిగాయని మీడియాలో వార్తలు సైతం వచ్చాయి. అంతేగాక సమంత డేట్స్ విషయంలోనూ బెల్లంకొండ ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి మరీ కంప్లైంట్ పెట్టి ఆమె డేట్స్ తెచ్చుకుని షూట్ చేస్తున్నారు. ఇక ఇంత వివాదం జరిగాక ఆ దర్శకుడు ..బెల్లంకొండతో సినిమా చేస్తాడా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. ఈ విషయంలో రామ్ ఏ మాత్రం కలుగ చేసుకోవటానికి ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











