దర్శకునిగా మరో ఎన్నారై
చిత్రరంగంపై ప్రవాసాంధ్రుల ఆసక్తి అంతా ఇంతా కాదు. ఉన్నతమైన చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సైతం వదులుకుని టాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న ఎన్నారైల సంఖ్య నానాటికీ పెరుగుతునే ఉంది. శేఖర్ కమ్ముల, బాలా రాజశేఖరుని.. తదితరులు ఆ కోవకు చెందిన వారే. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు జత కాబోతోంది. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రుడు తోలేటి చక్రి దర్శకుడిగా ఒక చిత్రం రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఆయన అమెరికాలో ఫిలిం డైరెక్షన్‌లో శిక్షణ కూడా పొందారని తెలుస్తోంది. విశాఖపట్నంలో సుప్రసిద్ధులైన డాక్టర్ తంబు తనయుడు చక్రి. జంధ్యాల వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో తంబు నటించారు. ఆయన తనయుడు చక్రి కూడా బాల నటుడిగా అనేక చిత్రాలలో నటించారు. ఉషాకిరణ్ మూవీస్ వారి పైలా పచ్చీస్ చిత్రంలో కూడా చక్రి ప్రధాన పాత్ర పోషించారు. కొంతకాలంగా అమెరికాలో స్థిరపడిన చక్రి టాలీవుడ్ దర్శకుడిగా తన ప్రతిభను చాటడానికి సమాయత్తం అవుతున్నారు. నవంబర్ నుంచి ఈ చిత్రం కాస్టింగ్, టెక్నీషియన్ల ఎంపిక కార్యక్రమం ప్రారంభం కానుంది. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











