ఎన్టీఆర్ 'బాద్‌షా'చిత్రం ఓపెనింగ్ విశేషాలు
ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్ హీరోయిన్ గా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్ క్లాప్‌నిచ్చారు. వెంకటేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టుని రామానాయుడు చేతుల మీదుగా శ్రీనువైట్ల అందుకున్నారు.
''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తక్కువ కాకుండా ఈ చిత్రం చేయబోతున్నాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. గణేష్‌బాబు లాంటి సిన్సియర్ నిర్మాతతో ఈ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే చిత్రం ఇది. ఇటీవలే తమన్ ఓ పాట కంపోజ్ చేశాడు'' అని శ్రీను వైట్ల చెప్పారు.
అనంతరం నిర్మాత గణేష్‌బాబు మాట్లాడుతూ - ''కోన వెంకట్, మోహన్ అందించిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 'దూకుడు'లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని శ్రీను వైట్లను కోరాను.ఎన్టీఆర్, శ్రీను వైట్ల, మా బేనర్‌కి గొప్ప పేరు తెచ్చే చిత్రం అవుతుంది. ఏప్రిల్ 20న షూటింగ్ ఆరంభిస్తాం'' అని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో రమేష్‌ప్రసాద్, రాజమౌళి, బూరుగుపల్లి శివరామకృష్ణ, నాగబాబు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, కోన వెంకట్, కోట శ్రీనివాసరావు, తమన్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం ముగిశాక రామ్‌చరణ్ కారులోనే ఎన్టీఆర్ కూడా వెళ్లారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ, రచన: గోపీమోహన్, కోనవెంకట్, సంగీతం: తమన్, సమర్పణ: శివబాబు బండ్ల.


Click it and Unblock the Notifications











