పౌరాణికాలపై ఎన్టీఆర్ దృష్టి
ఇమేజ్ కోసం ఇతరత్రా విషయాల కోసం తన స్టార్‌డమ్‌తోనే గేమ్స్ ఆడిన హీరో ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే మళ్లీ దారిలోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. అశోక్ చిత్రం 50 రోజులు ఆడి యావరేజ్ టాక్ రావడంతో కొద్దిగా వూపిరి పీల్చుకున్న ఈ యువహీరో తన భవిష్యత్తు కార్యాచరణ గురించి సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకూ బాబాయి బాలకృష్ణ ఇమేజ్‌ని చేరుకోడానికి యాక్షన్, ఫ్యాక్షన్ నేపథ్యాలను ఎంచుకుని వూకదంపుడు చిత్రాలు చేసి చతికిలబడిన ఈ హీరో ఇప్పుడు ఏకంగా తాతగారి ఇమేజ్‌ని చేరుకోడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల కొందరు సన్నిహితుల దగ్గర చెబుతూ - రానున్న రోజుల్లో తాతగారు ఎన్టీఆర్ చేసినట్టు పౌరాణిక చిత్రాలు చేయాలనుందన్నారు.
మంచి పౌరాణిక చిత్రాలు చేయాలనుంది. ముఖ్యంగా మా తాతగారి ఫేవరెట్ చిత్రాలను ముందు ఎంపిక చేసుకుంటున్నాను. వాటిల్లో మొట్టమొదటిది - దానవీరశూర కర్ణ. ఇప్పుడు అలాంటి చిత్రాలను చేస్తే నిలబడతాయా అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ ఆశాభావంతో సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటే అప్పటి చిత్రాలను మరింత జనరంజకంగా ప్రేక్షకులకు అందించవచ్చు అంటున్నారు ఎన్టీఆర్.
బాలీవుడ్ అంతా ఇప్పుడు పాత క్లాసిక్స్‌ని రీమేక్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. మన తెలుగులో కూడా నాటి క్లాసిక్స్‌ని రీమేక్ చేయడానికి, జానపద చిత్రాలు తీయడానికి ఇదే అనువైన సమయం అంటున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నమ్మకమే ఆయనకూ, ఆయన నిర్మాతలకూ శ్రీరామరక్ష!


Click it and Unblock the Notifications











