గుర్తుకొచ్చి వినాయిక్ బాధపడతాడు..ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్లో రెడీ అవుతున్న అదుర్స్ చిత్రం ఆడియో వేడుక ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ "ఈ రోజు ఇలా అందరి ముందు నిలబడ్డానంటే కారణం అభిమానుల ఆదరణే. ఏ రక్తసంబంధం లేకున్నా గుండెల్లో దాచుకుని అభిమానిస్తున్నారు. అందరికీ రుణపడి ఉంటాను. అదుర్స్ మొదలై ఏడాదిన్నర అయింది. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా వినాయక్ బాధపడుతుంటాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని మలిచారాయన. కోరిక, కసితో మేమిద్దరం చేసిన చిత్రమిది. సినిమాకొచ్చిన ప్రతి ఒక్కరినీ రెండున్నర గంటలు రంజింపజేస్తాం. దేవిశ్రీ చక్కటి సంగీతం అందించాడు. నాతో ఒక పాట కూడా పాడించాడు. వంశీ, నాని, బుజ్జి సహకారం మరవలేనిది. అందరూ అన్నట్టు నాకు రికార్డులు కాదు ముఖ్యం. మీ అందరి అభిమానమే ముఖ్యం" అన్నారు.
వైష్ణవి ఆర్ట్స్ ప్రై.లి. పతాకంపై వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమర్పకులు. నయనతార, షీలా నాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 'ఆది' 'సాంబ' చిత్రాల తర్వాత వినాయక్-ఎన్టీఆర్ కలిసి చేస్తున్న చిత్రమిది. ఈ కార్యక్రమంలో మాగంటి బాబు, శ్రీను వైట్ల, బ్రహ్మానందం, అశ్వనీదత్, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), దిల్ రాజు, మెహర్ రమేష్, ఛోటా కె.నాయుడు, కె.ఎల్.నారాయణ, గుణ్ణం గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











