హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ వి.వి.వినాయక్ కలిసి ముచ్చటగా మూడోసారి పని చేయబోతున్నారు. దానికోసం ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నటించిన యుగంధర్ ను వారు ఎంచుకున్నారు. అంటే తాజా యుగంధర్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడన్న మాట. యుగంధర్ ను కొడాలి ఫిలిమ్స్ పతాకంపై కొడాలి వెంకటేశ్వరరావు (నాని) నిర్మించనున్నారు. వాస్తవానికి యుగంధర్ సినిమా అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ బంపర్ హిట్ చిత్రం డాన్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఏ భాషలో తీసినా సూపర్ హిట్టయిన సినిమా ఇది. తమిళంలో ఈ చిత్రాన్ని అప్పట్లో బిల్లా గా రజనీకాంత్ హిట్టు కొడితే, ఇటీవల అజిత్ కూడా అదే పేరుతో తీసి విజయం సాధించాడు. ఈమధ్యే షారుఖ్ ఖాన్ సైతం డాన్ గా నటించి అలరించడం విశేషం. అందుకే కావచ్చు, ఎన్టీఆర్ దృష్టి యుగంధర్ మీద పడింది. జూనియర్ ఎన్టీఆర్ యుగంధర్ కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిద్దాం.