‘మా’ ఎన్నికల తీర్పు: హైకోర్టులో సవాల్ చేసిన కళ్యాణ్
హైదరాబాద్: ‘మా' ఎన్నికలను రద్దు చేయాలంటూ కోర్టుకెక్కిన నటుడు ఓ. కళ్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టులో ఎదురు దెబ్బతగిలిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతనికి రూ. 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. ఈ తీర్పుపై ఓ.కళ్యాణ్ స్పందిస్తూ మా ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి, సిటీ సివిల్ కోర్టు తీర్పును హై కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపారు. ఆయన చెప్పిన విధంగా గురువారం సిటీ సివిల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసారు కళ్యాణ్.
కళ్యాణ్ పిటీషన్ కొట్టి వేయడంతో పాటు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల ఫిలితాలు విడుదలకు కోర్టు గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. రేపు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు సాయంత్రంగానీ, శుక్రవారం గానీ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.

తాజాగా ఓ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.....ఫలితాలు వెలువడతాయా? లేక ఆపాలంటూ హై కోర్టు నుండి ఏమైనా ఆదేశాలు వస్తాయా? అనేది చర్చనీయాంశం అయింది. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి జయసుధ, రాజేంద్రప్రసాద్ లలో గెలుపు ఎవరిని వరిస్తుందనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మా ఎన్నికల ఫలితాల పైన సిటీ సివిల్ కోర్టు బుధవారం ఉదయం తీర్పు చెప్పడంతో వాతావరణం కాస్త చల్లబడినట్లయింది. అయితే ఓ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించడంతో మా ఎన్నికల వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎన్నికల ఫలితాలు విడుదల పైన రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని వెల్లడించింది. ఫలితాలు ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చునని సిటీ సివిల్ కోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మరి హై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











