నవంబర్లో ‘ఒక్కడినే’, ఈ నెల 14న ఆడియో
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడుగా అందాల నటి నిత్య మీనన్ నాయకిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాగ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వాన ఇంటిల్లిపాది చూసే చిత్రంగా 'ఒక్కడినే' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. డబ్బింగ్ కార్యక్రమాలు ముగించుకుని ఈ చిత్రం ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుపుకుంటోంది. నవంబర్లో ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈచిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...'ఫ్యామిలీ అనుబంధాల తీవ్రతను ఓ కొత్త కోణంలో ఈ చిత్రం ద్వారా చెబుతున్నాము. హీరో నారారోహిత్ ఇందులో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతుంది. అక్టబర్ 14న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోని శిల్పకళా వేధికలో విడుదల చేస్తాము. అక్టోబర్ నెలాఖరుకల్లా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయి. నవంబర్ మొదటి వారంలో సినిమాని రిలీజ్ చేస్తాము' అన్నారు.
నారా రోహిత్ చేసిన 'సోలో', నిత్యామీనన్ తాజాగా నటించిన 'ఇష్క్' చిత్రాలు రెండూ విజయవంతం కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్‌కు తగ్గ కథ ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది. ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు. ఈ చిత్రంతో తాను కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు నారా రోహిత్ ప్రయత్నిస్తున్నారు. నిత్యా మీనన్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈచిత్రంలో నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, బెనర్జీ, జీవి, అలి, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కెమెరామెన్: ఆండ్రుబాబు, కళ: నాగేంద్ర, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: గణేష్, కో డైరెక్టర్: కళ్యాణ్, ప్రొడక్షన్: తాండవ కృష్ణ, నిర్మాత: సివి.రెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.


Click it and Unblock the Notifications











