భావి ముఖ్యమంత్రి బాలయ్యే!?!?!
సినిమా ఫంక్షన్లు కూడా రాజకీయ వేదికలు అవుతున్నాయి. వద్దువద్దంటూనే చిరంజీవి ప్రస్తావన తెస్తున్నారు. చిరంజీవికి ఇష్టం ఉన్నా లేకున్నా తమకు నచ్చిన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారంనాడు సైబర్ గార్డెన్స్ లో జరిగిన ఒక్క మగాడు సినిమా ఆడియో విడుదల ఫంక్షన్ ఇందుకు వేదిక నిలిచింది. ఈ ఫంక్షన్ లో ఈ ప్రస్తావన తెచ్చింది స్వయంగా కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు కావడం విశేషం.
వివరాలలోకి వెళితే బాలకృష్ణ హీరోగా వైవియస్ చౌధరి దర్శకత్వంలో రూపొందిన ఒక్క మగాడు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని సైబర్ గార్డెన్స్ లో జరిగింది. ఈ ఫంక్షన్ లో దాసరి నారాయణరావు చిత్రవిచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడినట్టు మాట్లాడాడు. మెగాస్టార్ చిరంజీవి త్వరలో రాజకీయ పార్టీ పెడతారన్న ఊహాగానాల నేపథ్యంలో అదే కులానికి చెందిన దాసరి నారాయణరావు వ్యాఖ్యానాలు చిరంజీవికి చెంప పెట్టుగా ఉన్నాయి.
దాసరి మాటల్లోనే....సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చి తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి, అధికారంలోకి కూడా వచ్చిన ఒకే ఒక వ్యక్తి, మహత్తర శక్తి ఎన్టీఆర్ మాత్రమే..ఇది పబ్లిసిటీ కాదు...చరిత్ర..అలాంటి మహావ్యక్తి తనయుడు బాలకృష్ణ ఒక్క మగాడు సినిమాతో మరోమారు సత్తా చూపనున్నారు...అంటూ దాసరి నారాయణరావు ప్రసంగిస్తున్నంత సేపూ బాలకృష్ణ అభిమానులు ఉత్సాహంతో, ఉద్వేగంతో కేరింతలు కొట్టారు..కాబోయే సీఎం బాలకృష్ణ అంటూ నినాదాలు చేశారు.
దాసరి నారాయణరావు శిష్యుడు, విప్లవ సినిమాల దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ...బ్రదర్స్..మీరంతా బాలయ్య బాబును కాబోయే సీఎం అంటున్నారు..రావయ్యా బాలయ్యా అంటూ పిలుస్తున్నారు...ఆయన రాజకీయాలలోకి వస్తాడు..అయితే ఇప్పుడు కాదు..ఎన్టీఆర్ మాదిరిగా పాండురంగడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వివేకానందునిగా నటించి మెప్పించి, ఆ మహానటుని వారసునిగా మనల్ని రంజింపజేసిన తర్వాత రాజకీయాలలోకి రమ్మనండి...అన్నారు. కొసమెరుపేమంటే ఆ తరువాత మాట్లాడిన బాలకృష్ణ రాజకీయాల ప్రస్తావన అసలు తేలేదు.


Click it and Unblock the Notifications











