త్వరలో మహేష్‌తో సినిమా చేయబోతున్నా..: దిల్ రాజు
సూపర్‌స్టార్ మహేష్ బాబుతో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ పతాకంఫై త్వరలోనే ఓ సినిమా మొదలుపెట్టబోతున్నామని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం 'హలో గురు ప్రేమ కోసమే..' సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు తెలిపారు.
వైజాగ్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా దిల్ రాజు ఈ విషయాలు వెల్లడించారు. విశాఖలో సినీ ఇండస్ట్రీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని.. భవిష్యత్తులో మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు.

కాగా, ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివతో 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత మహేష్ ఏ సినిమా చేస్తాడన్న దానిపై క్లారిటీ లేదు. ఇంతలోనే దిల్ రాజు తమ బేనర్ లో సినిమా ఉంటుందని చెప్పడం గమనార్హం.
గతంలో మహేష్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ విజయాన్ని మరోసారి రిపీట్ చేసేలా.. మహేష్ కోసం దిల్ రాజు మంచి కథ సిద్దం చేయిస్తున్నట్టు టాక్.


Click it and Unblock the Notifications











