ఒక్కటంటే ఒక్కటే హిట్టు బొమ్మ!: చివరి నెలలో టాలీవుడ్‌కు గట్టి దెబ్బ..
హిట్టు బొమ్మతో 2017కు వీడ్కోలు చెప్పాలని భావించిన కొంతమంది హీరోలకు ఎదురుదెబ్బ తప్పలేదు. డిసెంబర్ నెలలో ఏకంగా 25 సినిమాలు విడుదలైతే ఒకటీ అరా తప్పితే.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిగా నిలబడలేకపోయింది. ఫలితంగా ఇయర్ ఎండ్‌లో టాలీవుడ్ కు ఫ్లాపుల భారం తప్పలేదు. ఇంతకీ ఆ ఫ్లాప్స్ మూటగట్టుకున్న చిత్రాలేంటో చూద్దాం..

జవాన్ ఫ్లాప్..:
మాస్ హీరోగా నిలదొక్కుకోవాలని ఆరాటపడుతున్న మెగా హీరోకు 2017 ముగింపు ఆశాజనకంగా లేదు. సాయిధరమ్ నటించిన 'జవాన్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.అటు డైరెక్టర్ బివిఎస్ రవికి కూడా ఇది పెద్ద దెబ్బే. వాంటెడ్ సినిమాతో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్న బివిఎస్ రవి రెండో సినిమాతోనూ ఓటమిని అధిగమించలేకపోయాడు.

సప్తగిరి ఎల్ఎల్‌బి..:
బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన సప్తగిరి ఎల్ఎల్ బి బాక్స్ ఆఫీస్ వద్ద బిలో యావరేజ్ గానే నిలబడింది. కొన్ని సన్నివేశాల్లో సప్తగిరి నటనకు మంచి మార్కులే పడినప్పటికీ.. కలెక్షన్ల పరంగా అంతగా రాణించలేకపోయింది. ఇక ఇది మా ప్రేమకథ, జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ వంటి సినిమాలు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.

ఎంసీఏ ఒక్కటే..:
డిసెంబర్ నెలలో విడుదలైన సినిమాల్లో ఎంసీఏ ఒక్కటే కాస్త పర్వాలేదనిపించింది. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. ఓవర్ సీస్ లోనూ మంచి ఓపెనింగ్స్ కలెక్ట్ చేసింది. భూమిక-నానిల సెంటిమెంటు వర్కౌట్ అవడం.. పోటీనిచ్చే సినిమా ఏది లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి.

హలో.. కాస్ట్ ఫెయిల్యూర్:
మొదటి సినిమా పరాజయాన్ని రెండో సినిమాతో అధిగమించాలని భావించిన అఖిల్ కు మరోసారి గట్టి దెబ్బ తగిలింది. విక్రమ్ కె కుమార్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశించినప్పటికీ.. మనసంతా నువ్వే కథనే మార్చి చెప్పారన్న విమర్శలు మూటగట్టుకుంది. ఆశించిన స్థాయిలో వసూళ్లు లేకపోవడం.. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువవడంతో.. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది.

ఒక్క క్షణం.. యావరేజ్:
ఒక్క క్షణం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా యావరేజ్ గానే మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోతుండటంతో లాంగ్ రన్‌లో బిలో యావరేజ్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు. ఇక సునీల్ 2కంట్రీస్ మరో డిజాస్టర్ మూటగట్టుకున్నట్లే అని తేలిపోయింది. సుమంత్ 'మళ్లీ రావా'చిత్రం మాత్రం కాస్త ఫర్వాలేదనిపించింది.


Click it and Unblock the Notifications











