మోహన్ బాబుని రానివ్వకపోవడం చేసిన తెలివైనపని: దాసరి
నిర్మాణ సమయంలో ఈ సెట్‌లోకి మోహన్‌బాబుని రానివ్వకపోవడం ఆమె చేసిన తెలివైనపని. ఒకవేళ మోహన్‌బాబుని రానిచ్చివుంటే... ఇంత పెద్ద సెట్‌ని వేయనిచ్చేవాడు కాదు. తను ఈ సెట్ కోసం చెక్‌పై సంతకం పెట్టిన ప్రతిసారీ ఉలిక్కిపడి ఉంటాడు అన్నారు దాసరి నారాయణ రావు. 'ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా' చిత్రం లోగో ఆవిష్కరణ కి హాజరైన ఆయన తొలి పోస్టర్ ని ఆవిష్కరించి ఇలా స్పందించారు.
బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో... మంచు మనోజ్, దీక్షాసేథ్ జంటగా రూపొందుతోన్న చిత్రం 'ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా'. శేఖర్‌రాజా దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న ఈ సినిమా లోగో ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గంధర్వమహల్ సెట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలి పోస్టర్‌ని దాసరి, మలి పోస్టర్‌ని కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.
ఇక బాలకృష్ణ మాట్లాడుతూ -''సాధారణంగా ఏ నిర్మాతైనా పేరుప్రఖ్యాతలు వచ్చాక ఇలాంటి భారీ సినిమా తీయాడానికి పూనుకుంటారు. కానీ లక్ష్మీప్రసన్న అలాకాదు. ఒక నమ్మకంతో ఈ సినిమా తీసింది. తాజ్‌మహల్ కట్టడానికి శ్రమించిన కూలీల్లా... చాలామంది ఈ సెట్ నిర్మాణానికి కష్టపడ్డారు. ఈ టైటిల్ విని, అందులో నేను నటిస్తున్నాను అని తెలియగానే... అందరికీ లేని ఉత్సుకత మొదలైంది. ఈ సినిమా ఆద్యంతం నేనుంటా. శ్రీరామరాజ్యం, ఊ కొడతారా... లాంటి సినిమాల్లో నటించడం ఓ వరంలా భావిస్తున్నాను'' అని చెప్పారు.
''ఈ సినిమాకోసం డబ్బు ఖర్చుపెట్టినప్పుడల్లా... నేను ఉలిక్కిపడుతూనే ఉన్నా. ఇలాంటి సెట్‌ని నిర్మించడం నాకిదే ప్రథమం. నాకు తెలిసి ఈ పదేళ్లలో ఎవరూ ఇలాంటి సెట్ వేసింది లేదు. డెరైక్టర్ అనేవాడు సినిమాకు కెప్టెన్ లాంటివాడని నమ్ముతాన్నేను. అనుకున్నదానికంటే సినిమాను బాగా తీశాడు శేఖర్‌రాజా. ఈ టీమ్‌పై ఉన్న నమ్మకంతో నేనెప్పుడూ సెట్‌కి రాలేదు. ఇటీవలే రషెస్ చూశాను. ఫస్ట్ క్రెడిట్ బాలయ్యకే దక్కుతుంది. అద్భుతంగా నటించాడు తను. ప్రతి సీన్‌లోనూ మా అన్నగారు ఎన్టీఆరే కనిపించారు. నిజానికి తన పాత్ర చూసి నేను అసూయపడ్డాను. ఈ సినిమాతో నిర్మాతగా నన్ను నేను నిరూపించుకుంటానని లక్ష్మీపసన్న చెప్పింది. కానీ బడ్జెట్ మాత్రం బాగా పెరిగింది. రష్ చూశాక పెట్టిన డబ్బు మొత్తం వచ్చేస్తుందని నమ్మకం కుదిరింది'' అని మోహన్‌బాబు అన్నారు.
లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ -''ఈ కథకు, ఇందులోని పాత్రలకు, ఈ గంధర్వమహల్‌కు ఉన్న సంబంధం ఏమిటో, ఎందుకింత భారీ సెట్ వేశామో రేపు సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. సుమారు ఆరున్నర కోట్ల భారీ వ్యయంతో ఈ సెట్ నిర్మించాం. మనోజ్ కెరీర్‌లోనే గొప్ప సినిమాగా ఇది నిలుస్తుంది. కథ విన్న వెంటనే నటించడానికి అంగీకరించి, మా వెన్నంటి నిలిచిన బాలయ్య అన్నయ్యకు నా థ్యాంక్స్. జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.
ఈ వేడుకలో ఇంకా ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఎమ్మెస్‌రాజు, విష్ణు, విరానికా, వరప్రసాద్‌రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వరరావు, బండి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ నెల 18న గుంటూరులో ఘనంగా ఆడియో వేడుక జరుపనున్నారు.


Click it and Unblock the Notifications











