పోసాని ‘ఆపరేషన్ ఐపీఎస్’ సెన్సార్ రిపోర్టు
హైదరాబాద్: వైవిద్యమైన సినిమాలకు, విచిత్రమైన పాత్రలకు, భిన్నమైన కథలకు పోసాని కృష్ణ మురళి పెట్టింది పేరు. రచయితగా అయినా, దర్శకుడిగా అయినా, నటుడిగా అయినా తనదైన శైలి చూపిస్తుంటారు పోసాని. సమాజంలోని కుళ్లు రాజకీయ వ్యవస్థను, నీతిమాలిన నాయకులను ఎండగట్టిన 'ఆపరేషన్ దుర్యోధన' చిత్రం ద్వారా ఎండగట్టిన పోసాని...'ఆపరేషన్ ఐపీఎస్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
పోసాని కృష్ణమురళి, ఆర్తీ అగర్వాల్, శేఖర్, పిడిరాజ్ ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మోహన్‌కాంత్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు.
దర్శకుడు మాట్లాడుతూ 'ఒక్క పోలీస్ అధికారి వందమంది దొంగల్ని ఎలా పట్టుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. సమకాలీన పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది. సమాజంలోని పోకడలు, పోలీసుల పనితీరుని చూపించే ప్రయత్నమిది. పోసాని పోషించిన పాత్ర కనువిప్పు కలిగించేలా ఉంటుంద''న్నారు.
గతంలో 420 అనే టైటిల్ పెట్టినప్పటికీ కొన్ని కారణాల వల్ల దాన్ని మార్చి 'ఆపరేషన్ ఐపీఎస్' అని పెట్టారు. ఈ చిత్రంలో 50 మందికిపైగా స్టేజి ఆర్టిస్టులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: జి.రాకేష్‌గౌడ్.


Click it and Unblock the Notifications












