నరసారావుపేటలో హీరో బాలకృష్ణ ఫ్లెక్సీ బ్యాన్నర్ ను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారు. ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం ముఖంపై నలుపు రంగు పోశారు. ఈ రెండు సంఘటనలతో బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి గంటకు పైగా రాస్తా రోకో చేశారు. ఈ రెండు ఘటనలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఒక్క మగాడు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో తాము అభిమానంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ ను చింపి వేయడం దారుణమని వారు పేర్కొన్నారు. ఇతర హీరోల బ్యానర్లను గౌరవించే సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని వారు హితవు పలికారు. రాస్తారోకో అనంతరం వారు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.